Tuesday, November 19, 2024

అతిక్ అహ్మద్ హత్య విచారణ పిటిషన్‌ను ఆమోదించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్యలపై విచారణ కోరుతూ దాఖలైన వినతిని సుప్రీంకోర్టు మంగళవారం స్వీకరించింది. వారి హత్యలపై మాజీ సుప్రీంకోర్టు జడ్జీ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. అడ్వొకేట్ విశాల్ తివారి స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన 183 ఎదురుకాల్పులు(ఎన్‌కౌంటర్ల)పై దర్యాప్తును ఆయన కోరారు.

అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు హంతకులు జర్నలిస్టులుగా నటిస్తూ హత్యచేశారు. శనివారం రాత్రి పూట ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజ్‌కి వారిని పోలీసులు తీసుకెళుతున్న సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఉదంతంలో అనేక అనుమానాలకు తావేర్పడుతోంది. పక్కా ప్లాన్‌తోనే వారిని లేపాశారనిపిస్తోంది. పోలీసుల సమక్షంలోనే, కస్టడీలోనే చంపేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికే ముప్పు అని, ఇది పోలీసు రాజ్యానికి దారితీయగలదని, కనుక దీనిపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. ఎక్స్‌ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్స్, లేక బూటకపు పోలీస్ ఎన్‌కౌంటర్లు జరుగకుండా చూడాలన్నారు. న్యాయ చేసే అధికారాన్ని పోలీసులకు కట్టబెట్టొద్దని, శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాల అధీనంలోనే ఉండేలా చూడాలన్నారు. ఏప్రిల్ 24న కేసు విచారణకు రానున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News