న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి మూడో ప్రభంజనం మరింత వికృతంగా ఉండబోతోందన్నహెచ్చరికలు వస్తుండడంతో సుప్రీంకోర్టు దీనిపై కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పుడు సిద్ధమైతే రాబోయే ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని తెలిపింది. మెడికల్ ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ పంపిణీ విధానాన్ని సమీక్షించుకోవాలని తెలిపింది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ పంపిణీపై పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ సలహా ఇచ్చింది. ఢిల్లీలోని కొవిడ్ రోగులకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికను సుప్రీంకోర్టు పరిశీలించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించామని కేంద్రం తెలిపింది.రోజుకు 700 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ తాము 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని తెలిపింది. ఢిల్లీలో తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది.
కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను ఉపయోగించే ఢిల్లీలోని ప్రధాన ఆస్పత్రుల్లో చెప్పుకోవదగిన స్థాయిలలో ఆక్సిజన్ నిల్వలున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. బుధవారం పెద్దమొత్తంలో ఆక్సిజన్ నగరానికి చేరిందని, దీనిని ఇంకా పంపిణీ చేయలేదన్నారు. అన్ లోడింగ్‌కు ఎక్కువ సమయం పడుతోందన్నారు. కాగా దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ రాష్ట్రాలకు ఆక్సిన్ కేటాయింపులకు సంబంధించి కేంద్రప్రభుత్వ ఫార్ములాను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.ఆక్సిజన్ ఆడిట్ అవసరమనే విషయాన్ని తాము అంగీకరిస్తామని, ఇతర రాష్ట్రాలకు కూడా సరైన ఫార్ములా అవసరమనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామన్నారు.
SC asks Center to prepared for third wave