న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయి జైలుపాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ మాగుంటకు ఢిల్లీ హైకోర్టు ంజూరు చేసిన 15 రోజుల తాత్కాలిక బెయిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది. రాఘవకు మంజూరైన తాత్కాలిక బెయిల్‌ను రద్దు చేయని సుప్రీంకోర్టు జూన్ 22కు బదులుగా జూన్ 12న లొగిపోవాలని ఆయనను ఆదేశించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
జైలు నుంచి దూరంగా ఉండేందుకే రాఘవ తాత్కాలిక బెయిల్ కోరారని ఇడి తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ధర్మాసనం ఎదుట వాదించారు. రెగ్యులర్ బెయిల్ కోసం రాఘవ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక సిబిఐ కోర్టు తిరస్కరించిందని, దీంతో తన భార్యకు అనారోగ్యమన్న కారణంతో తాత్కాలిక బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారని రాజు తెలిపారు. అయితే దీనిపై కోర్టు పరిశీలనకు ఆదేశించడంతో వెంటనే తన తాత్కాలిక బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారని తెలిపారు.
ఇప్పుడు తన అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందన్న కారణంగా రాఘవ మళ్లీ తాత్కాలిక బెయిల్ కోరాడని ఆయన తెలిపారు. ఆమె కిందపడ్డారని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా లేదని రాజు చెప్పారు. ఆమెను చూసుకోవడానికి వేరే వ్యక్తులు చాలామంది ఉన్నారని కూడా ఆయన వాదించారు. బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోవడం ఇప్పుడు అలవాటుగా మారిందంటూ ఈ సందర్భంగా ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఉదహరించారు. రెగ్యులర్ బెయిల్ రాకపోవడంతో తాత్కాలిక బెయిల్ కోసం రాఘవ ఈ ఎత్తుగడ వేశారని రాజు ఆరోపించారు.