Saturday, December 21, 2024

బలవంతుల బెయిల్!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession  కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం, పై కోర్టు దానిని రద్దు చేయడం లేదా సింగిల్ జడ్జి బెంచి జామీనును నిరాకరించడం అంతకంటే పెద్ద ధర్మాసనం దానిని అనుగ్రహించడం వంటివన్నీ మామూలే. బహుళ అంతస్థుల న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అతి పెద్ద ధర్మాసనం లేదా రాజ్యాంగ బెంచి వంటివి అంతిమ తీర్పు ఇచ్చే వరకు కింది స్థాయిలన్నింటిలోనూ అప్పీలుకు అవకాశముంటుంది. అంతిమ తీర్పు వెలువడిన తర్వాత కూడా మరొకసారి పరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టుకు విన్నవించుకునే దారి కూడా వుంటుంది. అక్కడ వెసులుబాటు లభించగల అవకాశమూ తెరుచుకునే వుంటుంది. కాని జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన క్రిమినల్ కేసులో నిందితునికి బెయిల్ మంజూరు చేసినప్పుడు హైకోర్టు ప్రజాస్వామిక మౌలిక పద్ధతిని పాటించలేదని ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను కొట్టి వేయడాన్ని అరుదైన విషయంగానే పరిగణించాలి.

మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగి విజయం సాధించిన రైతు ఉద్యమం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ వద్ద జరిగిన ఆందోళనలోని రైతులపై కారు నడిపించి నలుగురి దుర్మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణ ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది. బాధితుల మొర వినకుండా అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు మొన్న సోమవారం నాడు తప్పుపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ బెయిల్‌ను రద్దు చేసింది. తరతమాల తేడా తప్ప సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టు కూడా ఉన్నత న్యాయస్థానమే. కేసుల విచారణలో తీర్పులివ్వడంలో ప్రజాస్వామిక మౌలిక సూత్రాలను పాటించవలసిన బాధ్యత దానిమీద కూడా విశేషంగా వుంటుంది.

ఆశిష్ మిశ్రా కేసులో మాత్రం అలహాబాద్ హైకోర్టు ప్రజాస్వామిక న్యాయానికి బద్ధురాలై వ్యవహరించలేదని సుప్రీంకోర్టు నిర్ధారించింది. బెయిల్ మంజూరుకు సంబంధించిన విచారణ ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని బాధితులకు నిరాకరించడం ద్వారా హైకోర్టు తన పరిధులను దాటి వ్యవహరించిందని సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్య మన ఉన్నత న్యాయస్థానాల తీరును బోనులో నిలబెడుతున్నది. ఒక కేసులో నిందితులకు జామీను మీద విడుదలయ్యే అవకాశం కల్పించాలా, వద్దా అనే అంశంపై విచారణ జరిపేటప్పుడు, బాధితుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిందితుడు ఆశిష్ మిశ్రా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కావడం అతడి స్థాయిని తెలియజేస్తున్నది.

అంతటి బలవంతమైన స్థితిలోని నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం కోసం అలహాబాద్ హైకోర్టు బాధితుల అభ్యంతరాలను తెలుసుకోవాలనే ప్రజాస్వామ్య మౌలిక బాధ్యతను ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందనే అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యాఖ్యానాన్ని శ్రద్ధగా గమనించేవారికి కలిగితే ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఇటువంటి కేసుల విచారణ ప్రతి దశలోనూ బాధితుల అభిప్రాయం తెలుసుకోవలసి వుందని ధర్మాసన న్యాయమూర్తుల్లోని ఒకరైన జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. నిందితులకు బెయిల్ మంజూరును వ్యతిరేకించవలసిన బాధ్యత బాధితులకు, ప్రభుత్వానికి కూడా వున్నదని అలాగే నిందితుడైన ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును మళ్లీ కొత్తగా విచారించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం కూడా వుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ విధంగా అలహాబాద్ హైకోర్టు మూడు మాసాల్లోగా ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును తిరిగి విచారణకు స్వీకరించాలని గడువు విధించింది.

బాధితుల తరపున విధి నిర్వహించవలసిన యుపి రాష్ట్ర ప్రభుత్వం ఆశిష్ మిశ్రాకు బెయిల్‌ను సుప్రీంకోర్టులో ఎందుకు సవాలు చేయలేదు అని కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. తప్పు చేసినట్టు ఆరోపణను ఎదుర్కొంటున్నవారు తమవారైనప్పుడు వారికి లభించిన బెయిల్‌పై అప్పీలు చేయకుండా మౌనం వహించడంలోని దుష్ట రాజకీయం ఇంత అంత అని చెప్పలేము. ఇటువంటి అవకాశవాద మౌనాలు పాటించడం ద్వారా ప్రజాస్వామిక న్యాయపరమైన బాధ్యతలను విస్మరించడంలో మన ప్రభుత్వాలకు సాటి వుండరు. అందులోనూ రాజ్యాంగ వ్యవస్థలనే స్వార్థ రాజకీయం కోసం దుర్వినియోగం చేయడంలో సిద్ధహస్తులమని చాటుకుంటున్న బిజెపి ప్రభుత్వాలు ముఖ్యంగా యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటువంటప్పుడు చట్టబద్ధంగా, న్యాయ విహితంగా వ్యవహరిస్తేనే ఆశ్చర్యపోవలసి వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News