ఏప్రిల్ 14 నుండి అమలులోకి రానున్న చట్టం
అంబెడ్కర్ జయంతి రోజున ఉత్తర్వులు
దశాబ్దాల డిమాండ్ కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్‌సి వర్గీకరణ అమలుకు ముహూర్తం ఖరారయ్యి ంది. ఏప్రిల్ 14 నుండి ఎస్‌సి వర్గీకరణ అమలులోకి రానుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో ఎస్‌సి వర్గీకరణపై వేసిన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఎస్‌సి వర్గీకరణ చట్టానికి తుది రూపం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన ఎస్‌సి వర్గీకరణ తొలి ప్రతిని డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సబ్ కమిటీ ఉపాధ్యక్షుడు దామోదరం రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఎస్‌సి వర్గీకరణ ఒన్ మెన్ కమిషన్ కు అధ్యక్షత వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్‌సి అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జస్టిస్ షమీమ్ మక్తర్ ఆధ్వర్యంలో కమిషన్ రూపొందించిన సిఫారసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం వర్గీకరణ చట్టాన్ని ఆమోదించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 59 ఎస్‌సి ఉప కులాల మధ్యన ఉన్న అంతర్గత వెనుకబాటు తనాన్ని ఆధారం చేసుకుని మూడు గ్రూపులుగా విభజించినట్లు ఆయన తెలిపారు. మొదటి గ్రూప్ లో 15 ఉప కులాలు అత్యంత వెనుకబాటుతనంలో ఉండగా, ఆ 15 కులాల జనాభా 3.288 శాతంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఆ జనాభా ఆధారంగా వీరికి ఒక్క శాతం రిజర్వేషన్లు వర్తింప జేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
రెండవ గ్రూప్ లో రిజర్వేషన్ల ఆధారంగా అంతంత మాత్రం లబ్దిపొందిన ఉప కులాలు 18 ఉన్న్నాయని ఎస్‌సి జనాభాలో ఈ 18 కులాల జనాభా 62.74 శాతంగా ఉన్నందున వీరికి 9 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇక మూడో గ్రూప్ లో పై రెండు గ్రూప్ లతో పోల్చి చూసినప్పుడు ఒకింత ముందున్న 26 కులాల జనాభా 33.963 ఉండగా వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు.
ఎస్‌సి వర్గీకరణ పై భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జస్టిస్ షమీమ్ అక్తర్ ఎక్కసభ్య కమిషన్ నియమించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎస్‌సి ఉప కులాల సామాజిక, ఆర్ధిక స్థితి గతులపై లోతుగా అధ్యయనం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 8,600 పైగా వినతులు స్వకరించినట్లు ఆయన వివరించారు. ఎస్‌సి కులాల జనాభా ఆర్ధిక, ఉద్యోగ,ఉపాధి,విద్యా అవకాశాలపై సమగ్రమైన సమాచారాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తరువాత క్రమంలో కొత్తగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఎస్‌సి వర్గీకరణ డిమాండ్ దశాబ్దాలుగా నానుతూ వచ్చిందన్నారు. సుదీర్గ కాలంగా చట్టసభలలో ప్రాతినిధ్యం వహించిన తాను ఈ అంశాన్ని 1999 ప్రాంతంనుండి ప్రతీ శాసనసభ సమావేశాలలో ప్రత్యక్షంగా చూశానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించి చిత్తశుద్ధిని చాటు కున్నామన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణా శాసనసభలో వర్గీకరణను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడంతో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదించిన విషయాన్ని ఆయన ఉటంకించారు. కమిషన్ ప్రతిపాదించిన క్రిమిలేయర్ ప్రతిపాదనను సైతం తిరస్కరించినట్లు ఆయన తేల్చి చెప్పారు. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఉప కులాల హక్కులను హరిస్తే ఏర్పడబోయే పరిణామాలను గమనించి వర్గీకరణ ధర్మబద్ధంగా ఉండేలా తుది రూపు నిచ్చినట్లు ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో ఎస్‌సి ల జనాభా 17.5 శాతానికి చేరిందని 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఎస్‌సిలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.