రిజర్వేషన్ల ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందాలని.. అప్పుడే సామాజిక న్యాయం దక్కుతుందని రాజ్యాంగంలో చెప్పిన మాట. వాస్తవానికి రిజర్వేషన్లు అనేవి సామాజిక అణచివేతకు గురైన వర్గాలకు కల్పించేవి. అందులో భాగంగా ఈ దేశంలో అట్టడుగు స్థానంలో ఉన్న వర్గాలు దళిత వర్గాలు. అయితే దళిత వర్గాల్లోనూ తీవ్రమైన అసమానతలున్నాయి. ఎస్‌సిల్లో దాదాపు 59 ఉపకులాలతో కలిపి ఉన్నాయి. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాలని లక్ష్యంతో, అలాగే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి జనాభాలో మాదిగలు మెజారిటీ వర్గంగా ఉన్నారు. తరతరాలుగా ఉమ్మడి రిజర్వేషన్లవల్ల పెద్ద సామాజికవర్గమైన మాదిగలు, అటు సంచార జీవితాలు గడిపే సిందు, దక్కలి, బేడ బుడగజంగాలు లాంటి అనేక ఉపకులాలు మరింత ఉనికిని కోల్పోయాయి.
వాస్తవానికి మాల, మాదిగలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల కొంత లాభమే పొందినప్పటికీ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఇంకా సరైన ప్రాధాన్యమే లేదు. అసలు తమకంటూ వాటా ఉందనే భావనే వారికి లేదు. అంటే ఉమ్మడి ఎస్‌సి రిజర్వేషన్ల వల్ల వారు అవగాహన పెంచుకోలేకపోయారు. ఇటు పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ తీవ్రమైన వెనుకబాటుకు కారణమయ్యారు.అయితే ఈ సామాజిక అసమానతలను దూరం చేయడానికి ఎస్‌సి వర్గీకరణ చేసి ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటా దక్కాలని ఎస్‌సి వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ల కింద మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎంఆర్‌పిఎస్ ఉద్భవించింది.1994లో ప్రారంభమైన ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభావవంతంగా పని చేయగలిగింది. కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలతో అనేక మాదిగ సంఘాలు ఏర్పడి విస్తృతంగా ఉద్యమించాయి.
కేవలం వర్గీకరణ చేస్తే అనుకున్న లక్షం అసంపూర్తిగానే మిగిలిపోతుందని, జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్‌సి వర్గీకరణ జరిగితేనే ఎస్‌సి రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కుతాయని వర్గీకరణ ఉద్యమంలో ఆనాడే కొత్త దండోరా తెలంగాణ ఎంఆర్‌పిఎస్ ఉద్భవించింది. 1997లో ప్రధానంగా తెలంగాణ మాదిగ దండోరాను నాగారం అంజయ్య, ప్రొఫెసర్ తిరుపతి, ప్రొఫెసర్ పురుషోత్తం, చింత స్వామి, సతీష్ మాదిగలు ఉద్యమాన్ని చేపట్టారు. జనాభా నిష్పత్తి తీయకుండా కేవలం వర్గీకరణ చేయడం వల్ల రిజర్వేషన్ల ఫలాలు అంతంత మాత్రంగానే అందే అవకాశం ఉంటుందనే డిమాండ్‌ను వినిపిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి.
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో వర్గీకరణ డిమాండ్ సరైనదే. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయింది. ఏర్పాటు అయిన తెలంగాణలో మాదిగల జనాభా నిష్పత్తి దాదాపు 65 లక్షల వరకు ఉంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా, తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూసినా మాదిగల జనాభా 12 శాతానికి చేరింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎస్‌సి రిజర్వేషన్లు 15 శాతం కల్పిస్తున్నది. 12 శాతం జనాభా కలిగిన మాదిగలు మళ్లీ నష్టపోయే ప్రమాదం ఉంది. రాజకీయ పార్టీలు ఎస్‌సి వర్గీకరణను ఓ రాజకీయ అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నించాయి. అయితే అనేక పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు ఇటీవల వర్గీకరణకు అనుకూల తీర్పును ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సానుకూల తీర్పునిచ్చింది. అయితే ఎస్‌సిలను కేవలం ఎ, బి, సి, డిలుగా విభజించినంత మాత్రాన ఫలితం ఉండదు.
విభజనతో పాటు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అందినప్పుడే ఎస్‌సి వర్గీకరణకు పూర్తి న్యాయం చేసినట్లు అవుతుంది తప్ప లేకుంటే మళ్లీ అంతే సంగతి. రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. అందుకే అనేక మాదిగ సంఘాలు వర్గీకరణ జరగడంతో పాటు జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు కల్పిస్తేనే దాని ఫలితం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఎ, బి, సి, డి గ్రూపులుగా చేసి పాత రిజర్వేషన్లనే కల్పిస్తే మాదిగలకు మళ్లీ విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పాత పద్ధ్దతితో భంగపాటుకు గురికాక తప్పదు. వర్గీకరణ విషయంలో, మాదిగల న్యాయమైన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. తెలంగాణలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డారనే విషయాన్ని అనేక మంది మేధావులు, ప్రజాప్రతినిధులు బహిరంగంగా చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిఎం రేవంత్ రెడ్డి సైతం మాదిగల కంటే మాలలే ముందున్నారు.
మాదిగలు వెనుకబడి ఉన్నారనే మాటను గుర్తు చేశారు. జనాభాపరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిగలు తరతరాలుగా ఏదో కష్టం చేసుకొని ఆ పూటకు బతికితేచాలు అన్నట్లుగా ఇంకా కొంత వెనుకబాటులోనే ఉన్నారని ఆయన చెప్పారు. ఇలా ఒక్క రేవంత్ రెడ్డినే కాదు రాజకీయ పక్షాలన్నింటికీ తెలుసు అత్యంత ప్రభావవంతమైన సంఖ్యా బలం ఉన్న మాదిగలు తరతరాలుగా సామాజిక అసమానతలకు దూరంగా ఉన్నారనేది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణను స్వాగతిస్తూ… వెంటనే తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్న 15% రిజర్వేషన్లు కాకుండా పూర్తిగా ఎస్‌సి ఉపకులాలతో సహా లెక్కలు తీసి మాదిగల వాటా ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. సుప్రీంకోర్టు సైతం ఎస్‌సి వర్గీకరణ అమలు బాధ్యత రాష్ట్రాలకే అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఇప్పటికే మూడు దశాబ్దాలుగా అనేక రకాల అవకాశాలకు దూరం అవుతున్న మాదిగల పట్ల, ఉపకులాల పట్ల ఎవరి వాటాను వారికి స్పష్టం చేస్తే రిజర్వేషన్లు అందరికీ అందే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా నామమాత్రంగా వ్యవహరిస్తే మాత్రం మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వర్గీకరణ ఉద్యమంలో అందుకే భిన్నమైన సంఘాలు ఏర్పడ్డాయి. జనాభా నిష్పత్తితో కూడిన వర్గీకరణ ఫలాలు అందించేలా ఎస్‌సి వర్గీకరణ చేయాలని ఉద్యమాలు జరిగాయి.వర్గీకరణ ఉద్యమం జరుగుతూనే మాదిగల వాటాపై స్పష్టత కోరుతూ ముందు నుంచి కొందరు మాదిగ ఉద్యమకారులు, ప్రొఫెసర్లు డిమాండ్ ఉంచారు. ఎ, బి, సి, డి లుగా వర్గీకరణ చేయడం ఎంత ముఖ్యమో.. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మాదిగలకు రిజర్వేషన్లు పెంచాలనేది మరో కొత్త డిమాండ్ ఎప్పటి నుంచో వినిపించారు.వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలోనూ తెలంగాణ ఉద్యమంతో పాటు వర్గీకరణ ఉద్యమం తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఒయు జెఎసి అధ్యక్షుడు పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం 12% వాటా కోసం మద్దతు ఇవ్వాలని ఆయన వర్గీకరణ ఉద్యమంలో కొత్త డిమాండ్‌ను ఎప్పటికప్పుడు రాజకీయ పక్షాల ముందుంచారు. ఓ వైపు తెలంగాణ ఉద్యమంలో మాదిగలను, యువతను విద్యార్థి లోకాన్ని ముందుంచేలా కృషి చేశారు. అదే సమయంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్విరామంగా మాదిగల న్యాయమైన డిమాండ్ కోసం నిత్యం కృషిచేశారు. వర్గీకరణ చేయడం ఎంత ముఖ్యమో అదే విధంగా మాదిగల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించకపోతే రిజర్వేషన్ల ఫలాలు అందే అవకాశం మళ్లీ అంతంత మాత్రమేనని ఆయన మరో మాదిగ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. మాదిగ జెఎసిని స్థాపించి ఆయన చేసిన చైతన్య కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. సభలు, సమావేశాలతో మాదిగలను జాగృతం చేశారు. గతంలో 2021లో మాదిగల రథయాత్ర కార్యక్రమం, 2024లో మాదిగల జోడో యాత్రతో దాదాపు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించారు.
మూడు దశాబ్దాల ఎస్‌సి వర్గీకరణ పోరాటంలో 12% రిజర్వేషన్లు కోసం మొదటి నుంచి పట్టుబట్టింది మాత్రం పిడమర్తి రవి. దాదాపు 2012 నుంచి సుదీర్ఘ కాలం ఆయన పోరాటమంతా వర్గీకరణ చేసి ఎస్‌సిల రిజర్వేషన్లు పెంచాలి. అందరికీ సమానంగా పంచాలి అంటూ మాదిగల వాటా కోసం మొదటి నుంచి పట్టుబట్టిన నాయకుడు పిడమర్తి రవి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సైతం మాదిగల ఆవేదన, వారి స్థితిగతులు, వెనుకబాటును గుర్తించి.. ఎస్‌సిల రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్రాలకే పూర్తి అధికారం ఇచ్చింది. అయితే ఎస్‌సి జాబితాలో ఉన్న 59 కులాలకు వర్గీకరణ ఫలాలు సంపూర్ణంగా అందాలంటే ఎవరి వాటా వారికి దక్కితేనే సాధ్యం అవుతుంది. అలాకాకుండా పాత పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎస్‌సి వర్గీకరణ అమలు చేసిన మళ్లీ మాదిగలకు అన్యాయమే కలిగే అవకాశం ఉంది. వర్గీకరణ ఉద్యమంలో 12% మాదిగలకు కేటాయించాలనే నినాదంతో పిడమర్తి రవి ఆధ్వర్యంలో దాదాపు పదేళ్ల కాలంలో ప్రతీ పార్లమెంటు సమావేశాల్లో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలతో మాదిగల ఆవేదనను ఢిల్లీ నడి రోడ్డ్డులోనూ విన్పించారు. తక్షణమే అమలు చేయాలన్నా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఉపకులాల నిష్పత్తి ప్రకారం న్యాయం చేస్తేనే వర్గీకరణ ఉద్యమానికి న్యాయం జరిగినట్లు అవుతుంది.
సంపత్ గడ్డం
7893303516