Wednesday, January 22, 2025

మాదిగ సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) వెబ్ సైట్ ఆవిష్కరణ


మనతెలంగాణ/ హైదరాబాద్ : మాదిగ సామాజిక వర్గం గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, తద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. మంగళవారం బేగంపేటలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో జరిగిన మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) మొదటి వార్షిక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిక్కీ వెబ్ సైట్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ప్రస్తుత కాలంలో ప్రతిభ ముఖ్యమని, టాలెంట్ ఎదుట కులాలు మతాలు ఏవీ పనిచేయవని అన్నారు.

గతంలో ఉన్న సామాజిక అసమానతలు ఇప్పుడు లేవని ఆయన అన్నారు. గ్రీన్‌పార్క్ హోటల్‌కు చారిత్రక నేపథ్యం ఉందని, దాదాపు 20 సంవత్సరాల క్రితం ఉద్యమనేత, టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దళిత పాలసీ సమావేశం ఇక్కడే నిర్వహించామని, నాటి సమావేశం స్ఫూర్తితోనే దళితబంధు స్కీం అమలు జరుగుతోందని, అదే హోటల్లో మిక్కీ సమావేశం జరగడం విశేషమన్నారు. మాదిగ పారిశ్రామికవేత్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని అన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వినోద్‌కుమార్ సూచించారు. మిక్కీ సభ్యుల అభ్యున్నతి కోసం తనవంతు సహకారాన్ని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పగిడిపాటి దేవయ్య, మిక్కీ అధ్యక్షులు సుంచు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క నరసింహ, సలహాదారులు ఆరేపల్లి రాజేందర్, వంశీ తిలక్, గంధం రాములు, కొమ్ముల నరేందర్, జయరాజ్ తెన్నేటి, సాయికుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News