న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంలోని రాజ్యాంగబద్థతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
పిటిషనర్ల తరఫున వాదనలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. అనేక విధాలుగా ఇది చారిత్రాత్మక క్షణమని ఆయన అన్నారు. 2019 ఆగస్టు 6న చరిత్ర ఎందుకు తిరగరాయబడింది,
ప్రజాస్వామ్యబద్ధంగానే పార్లమెంట్ అనుసరించిందా, జమ్మూ కశ్మీరు ప్రజల మనోభీష్టం అణచివేతకు గురైందా వంటి విషయాలను న్యాయస్థానం అధ్యయం చేయనున్నదని ఆయన అన్నారు. ఈ కేసు విచారణ చేపట్టడానికి న్యాయస్థానానికి ఐదేళ్లు సమయం పట్టడం, ఈ ఐదేళ్లుగా అక్కడ ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోవడం వంటివి కూడా చారిత్రాత్మకం అనడానికి కారణాలని సిబల్ అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఉద్దేశించిన ఈ 370వ అధికరణ క్షీణించిందని, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఇప్పుడు జరుగుతుందా అంటూ ఆయన వాదన కొనసాగించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కూడా కనుగొనకుండా అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచాలని 2018 జూన్ 28న ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. 356వ అధికరణను ఉపయోగించక ముందే 2018 జూన్ 21న అసెంబ్లీని రద్దు చేయవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలను ఎన్నడూ లేవనెత్తలేదని, అందుకే ఇది చారిత్రాత్మక విచారణగా తాను భావిస్తున్నానని సిబల్ చెప్పారు.
మౌఖికంగా వాదనలు వినిపించేందుకు సిబల్‌కు కోర్టు 10 గంటల సమయాన్ని కేటాయించగా ఆయన భారత సమాఖ్యలో జమ్మూ కశ్మీరు విలీనానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ఈ పిటిషన్లపై విచారణ అనేక రోజులపాటు కొనసాగనున్నది.
రాజ్యాంగంలోని 370వ అధికరణ, 35ఎ అధికరణ రద్దుకు సంబంధించి రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులు, జమ్మూ కశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని(జమ్మూ కశ్మీరు లడఖ్) సవాలు చేస్తూ 20కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టు 5న వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించాలని పిటిషన్లు కోరుతున్నారు.
రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే జమ్మూ కశ్మీరు పునర్వవస్థీకరణ చట్టం, 2019ఇప్పటికే అమలులోకి వచ్చింది. 2019 అక్టోబర్ 31న చేసిన మార్పులు ఇప్పటికే అధికారిక గెజిట్ ద్వారా నోటిఫై అయ్యాయి.