2011 నాటి వేతనాలపై సుప్రీం ఉత్తర్వులు
న్యూఢిల్లీ : రాజస్థాన్ స్కూల్ టీచర్లకు పది సంవత్సరాల క్రితం నాటి వేతనాల చెల్లింపులకు రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజస్థాన్‌లో ఓ ప్రభుత్వ సహాయక నిధులతో నడిచే స్కూల్ 2011లో మూతపడింది. ఈ స్కూల్ టీచర్లకు వేతనాలు అందలేదు. అప్పటి వేతనాలలో 70 శాతం రీయింబర్స్‌మెంట్‌కు శనివారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువరించింది. టీచర్లకు ఈ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2019లో వెలువరించిన ఆదేశాలకు కట్టుబడి ఉండనందుకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులపై దాఖలు అయిన కోర్టు ధిక్కార అభియోగాల కేసును ఇప్పుడు న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం మూసివేసింది. ఈ టీచర్లకు సంబంధిత రీయింబర్స్‌మెంట్‌ను నాలుగు వారాల వ్యవధిలో సమకూర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ట్రస్టు ఆధ్వర్యంలో ఈ స్కూల్ నిర్వహించేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీచర్లకు వేతనాలలో 70 శాతం వరకూ చెల్లించాల్సి ఉన్నందున దీనిని అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వ వర్గాలపై ఉన్న ధిక్కార విచారణను తప్పించడం జరిగింది. ఈ విధంగా ఇరుపక్షాలకు న్యాయం చేసినట్లుగా నిర్థారణకు వస్తున్నామని ధర్మాసనం తెలిపింది.