న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి జరగాల్సిన ‘గేట్’ పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్ణీత షెడ్యూల్‌కు 48 గంటల ముందు పరీక్షలను వాయిదా వేయడం గందరగోళానికి, అనిశ్చితికి దారి తీస్తుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో పరీక్షల కోసం సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడలేమని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ విక్రమ్నాథ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా గేట్‌ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
పరీక్షను ఎప్పుడు నిర్వహించాలనేది అకాడమిక్ పాలసీకి సంబంధించిన అంశమని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలియజేసింది. తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉందని, కానీ దాదాపు 20వేల మంది మాత్రమే పరీక్షకు వాయిదా వేయాలంటూ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేశారని ప్రస్తావించింది. ఇదిలా ఉండగా, పరీక్ష విషయంలో కొవిడ్ పరంగా తగిన మార్గదర్శకాలు విడుదల చేయనందున దీని నిర్వహణపై మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని బుధవారం సుప్రీం కోర్టులో విద్యార్థుల తరఫున పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అడ్మిట్ కార్డులూ జారీ అయినందున పిటిషన్‌ను లిస్ట్ చేయాలని కోరగా, సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించింది.
SC dismisses plea to postpone GATE Exams 2022