Monday, December 23, 2024

గుజరాత్ హైకోర్టు తీరుపై సుప్రీం అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి 26 వారాల గర్భ స్రావం కేసు విచారణను గుజరాత్ హైకోర్టు అనవసరంగా వాయిదా వేయడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అనవసర వాయిదా కారణంగా బాధితురాలి విలువైన సమయం కోల్పోయినట్టు అయిందని వ్యాఖ్యానించింది. ఈ కేసుపై జస్టిస్ బివి నాగరత్న,జస్టిస్ యుజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శనివారం ప్రత్యేక విచారణ చేపట్టింది. ఇలాంటి కేసుల విషయంలో లోపభూయిష్టమైన వైఖరి పనికిరాదని, అత్యవసర భావం ఉండాలని గుర్తు చేసింది. ఈ కేసులో పిటిషనర్ 25 ఏళ్ల యువతి .తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోడానికి వీలు కల్పించాలని గుజరాత్ హైకోర్టును ఆగస్టు 7న పిటిషన్ దాఖలు చేయగా, మరునాడు ఆగస్టు 8న గర్భిణి ప్రస్తుత పరిస్థితిని, ఆరోగ్యాన్ని నిర్ధారించాలని మెడికల్ బోర్టుకు గుజరాత్ హైకోర్టు ఆదేశించింది.

దీనిపై గర్భిణిని పరీక్షించిన మెడికల్ కాలేజీ ఆగస్టు 10న నివేదిక కోర్టుకు సమర్పించింది. అయితే హైకోర్టు ఆగస్టు 11న ఈ నివేదికను స్వీకరించడం విస్మయం గొలిపింది. అయితే ఈ కేసు విచారణకు ఆగస్టు 23న నిర్ణయించడం అనవసర జాప్యానికి కారణమైంది. దూరదృష్టి లోపించడం వల్లనే గుజరాత్ కోర్టు వాస్తవాలు విస్మరించినట్టయిందని సుప్రీం కోర్టు ధర్మాసనం గ్రహించింది. ఈ అనవసర జాప్యం వల్ల బాధితురాలికి 28 వారాల గర్భం సమీపించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విశాల్ అరుణ్ మిశ్రా సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. ఈ విషయంలో మళ్లీ గుజరాత్ హై కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కోరింది. ఆ ఉత్తర్వు వచ్చిన తరువాత ఉత్తర్వు కచ్చితత్వాన్ని పరిగణిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషనర్‌కు తెలియజేసింది. అలాగే హైకోర్టుకు మెడికల్ బోర్టు సమర్పించిన నివేదికను కూడా ధర్మాసనం కోరింది. ఆ రిపోర్టు ప్రకారం గర్భస్రావం జరుగుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలియజేశారు. గర్భస్రావ చట్టం ప్రకారం గర్భస్రావానికి వ్యవధి 24 వారాలు మించకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News