న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనలో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మార్చి 11న విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్ 3న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతోసహా 8 మంది మరణించారు. ఈ కేసులో అరెస్టయి నాలుగు నెలలు కస్టడీలో ఉన్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ బెంచ్ ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాదనలు విన్న అనంతరం దీనిపై మార్చి 11న విచారణ జరపడానికి అంగీకరించింది. ఈ కేసులోని ఇతర నిందితులకు బెయిల్ లభించలేదని, ఆశిష్ మిశ్రాకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి కోరారు.
ఆశిష్ మిశ్రాకు బెయిల్ రద్దుపై 11న సుప్రీం విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -