Monday, December 23, 2024

సుప్రీంపై వివాదాస్పద వ్యాఖ్యలు: యతి నరసింఘానందకు కోర్టు ధిక్కార నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంపై నిరాధార, కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన కోర్టు ఘధిక్కార పిటిషన్‌కు సంబంధించి హిందూత్వ నాయకుడు యతి నరసింఘానందకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.

యతి నరసింఘానందపై సాక్షి నెల్లి అనే హక్కుల కార్యకర్త దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమాధానం కోరుతూ నోటీసులు జారీచేసింది. ఈ వ్యవస్థపైన, ఈ రాజకీయ నాయకులపైన, ఈ సుప్రీంకోర్టుపైన, ఈ సైన్యం పైన నమ్మకం ఉన్నవారు కుక్కచావు చస్తారు అంటూ యతి నరసింఘానంద గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా దీనిపై సాక్షి నెల్లి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టుపైన, రాజ్యాంగంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యతి సరసింహానందపై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి కోరుతూ హక్కుల కార్యకర్త సాక్షి నెల్లి దరఖాస్తు చేసుకోగా 2022 జనవరిలో అప్పటి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అనుమతి ఇచ్చారు. యతి నరసింఘానంద చేసిన వ్యాఖ్యలు దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రతిష్టను కించపరిచే విధంగా ఉన్నాయని, ఇది సుప్రీంకోర్టును ధిక్కరించే విధంగా ఉన్నాయని వేణుగోపాల్ తన సమ్మతి పత్రంలో తెలిపారు.

యతి నరసింఘానంద గత ఏడాది ప్రారంభంలో ఒక ఇంటర్వూ ఇస్తూ వివిధ వ్యవస్థలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత సుప్రీంకోర్టుపైన, రాజ్యాంగంపైన మాకు నమ్మకం లేదు. దేశంలోని 100 కోట్ల మంది హిందువులను రాజ్యాంగం మింగేస్తుంది. ఈ రాజ్యాంగాన్ని నమ్మినవారికి చావు తప్పదు. ఈ వ్యవస్థను, ఈ రాజకీయ నాయకులను, ఈ సుప్రీంకోర్టును, ఈ సైన్యాన్ని నమ్మినవాళ్లు కుక్క చావు చస్తారు అంటూ యతి నరసింఘానంద వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇంతటి హేయమైన దాడి ఎన్నడూ జరగలేదని, ఈ వ్యాఖ్యలను పట్టించుకోకుండా వదిలేస్తే సుప్రీంకోర్టు ప్రతిష్ట దిగజారడానికి అనుమతించినట్లవుతుందని సాక్షి నెల్లి అటార్నీ జనరల్‌కు అనుమతి కోసం రాసిన లేఖలో పేర్కొన్నారు.
కాగా..వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కడం యతి నరసింఘానందకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు పత్రికల పతాక శీర్షికలకెక్కాయి. హరిద్వార్‌లోని భారతీయ ముస్తింలను ఊచకోత కోయాలంటూ యతి నరసింఘానంద పిలుపునిచ్చి సంచలనం సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News