Monday, December 23, 2024

ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సనాతన ధర్మ నిర్మూలన సదస్సు పేరిట సెప్టెంబర్ 2న జరిగిన సమావేశంపై సిబిఐతో దర్యాప్తు జరపించాలని, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టుకు చెందిన న్యాయవాది ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టుకే ఎందుకు వచ్చారని పిటిషనర్ బి జగన్నాథ్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒక వ్యక్తి ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భమైతే అర్థం చేసుకోవచ్చని, కాని ఇక్కడ ఒక రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

సుప్రీంకోర్టును మీరు పోలీసు స్టేషన్‌గా మార్చేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే విద్వేష ప్రసంగాలకు సంబంధించి ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

సనాతన ధర్మంపై లేదా హిందూత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి, డిఎంకె నాయకులు పీటర్ ఆల్ఫోన్స్, ఎ రాజా, తోల్ తిరుమాలలవన్, వారి అనుచరులు భవిష్యత్తులో ఎటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ విన్నవించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News