ట్రయల్ కోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఫోర్జరీ మోసానికి సంబంధించిన కేసులో విచారణను 78 సార్లు వాయిదా వేసినందుకు డెహ్రాడూన్ ట్రయల్ కోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ట్రయల్‌కోర్టును ఆదేశించింది. 2014లో విచారణ చేపట్టిన కోర్టు ఏడేళ్లలో ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్లలేకపోయిందని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు సాక్షులను ప్రవేశపెట్టడంలో అలసత్వం ప్రదర్శించవద్దని దర్యాప్తు అధికారులను కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో నిందితులైన మనీశ్‌వర్మ, సంజీవ్‌వర్మ, నీతూవర్మలు ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
విచారణకు సహకరించకపోతే వారి బెయిల్‌ను రద్దు చేయాలని కూడా ధర్మాసనం సూచించింది. డాక్టర్ అతుల్‌కృష్ణ అనే బాధితుడు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసేలా ఆదేశించాలని బాధితుడు ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరించడం గమనార్హం. మీరట్ జిల్లా జానీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ల్యాండ్ డీల్‌కు సంబంధించిన ఫోర్జరీ కేసు ఇది. 2012లో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, 2014 జూన్ 28న ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించింది. 2020 అక్టోబర్ 15 వరకు ఈ కేసు విచారణ వివిధ కారణాలతో 78సార్లు వాయిదా పడింది.