బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలుచేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం తెలిపారు.
శుక్రవారం తనను కలసిన రైతులు, దళితులు, కార్మికులు, కన్నడ అనుకూల కార్యకర్తలతో కూడిన ప్రతినిధి బృందానికి తమిళనాడుకు కావేరీ లాలను విడుదల చేయనిపక్షంలో తలెత్తే పర్యవసానాల గురించి సిద్దరామయ్య వివరించారు.
కావేరీ జలాలలను తమిళనాడుకు విడుదల చేయకూడదన్నదే తమ అభిప్రాయం కూడా అని ఆయన తెలిపారు. అయితే తాము నీరు విడుదల చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని జలాశయాలను స్వాధీనం చేసుకుంటుందని ఆయన చెప్పారు. కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ కూడా చేయవచ్చని సిద్దరామయ్య వారికి వివరించారు.
కావేరీ జలాల విడుదలకు సంబంధించి వ్యవహారంలో తీసుకోవలసిన చర్యలను చర్చించేందుకు కర్నాటకకు చెందిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మాజీ అడ్వకేట్ జనరల్స్, నీటిపారుదల రంగ నిపుణులతో శుక్రవారం సాయంత్రం సిద్దరామయ్య సమావేశం కానున్నారు.