న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్‌ను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది సౌరభ్ మిశ్రా వాదిస్తూ తదుపరి విచారణ వరకు విచారణ కమిషన్ తన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ బహిరంగ నోటీసు జారీచేసిందని, రోజువారీ విచారణ ప్రక్రియను చేపట్టిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని తెలిపిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు అందచేయావలసిందిగా పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిషన్‌ను నియమించే అధికారం లేదంటూ పిటిషనర్ చేసిన వాదనను ధర్మాసనం తప్పుపడుతూ మీ అఫిడవిట్‌లోనే అస్పష్టత ఉందని పేర్కొంది. పెగసస్ వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూనే విచారణ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారంటూ పిటిషనర్‌ను ధర్మాసనం ఆక్షేపించింది. కాగా.. ఈ విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. గత నెల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య సభ్యులుగా విచారణ కమిషన్‌ను నియమించింది.