న్యూఢిల్లీ: బ్యాంక్‌లకు రూ.9,000 కోట్లకు పైగా ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్య కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు సోమవారం శిక్షను ప్రకటించనుంది. ఈ కేసులో 2017లోనే మాల్యను దోషిగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే శిక్షాకాలంపై మాల్య వ్యక్తిగత వాదనలను వినడం కోసం ఇన్నాళ్లు ఎదురు చూసింది. చివరికి గత మార్చి 10న ఈ కేసులో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన బెంచ్ శిక్షా కాలంపై తీర్పును వాయిదా వేసింది.
ఈ సందర్భంగా బెంచ్ మాల్యపై ప్రొసీడింగ్స్ ‘ కొనసాగించడానికి వీలు లేని స్థితికి చేరుకుందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ చట్టం, శిక్షలకు సంబంధించి వివిధ అంశాలపై సీనియర్ అడ్వకేట్, అమికస్ క్యూరీ ( కోర్టు సహాయకుడు) జైదీప్ గుప్తానుంచి సలహాలు, సూచనలను విన్న బెంచ్ శిక్షలకు సంబంధించి లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి మాల్య తరఫు న్యాయవాది అంకుర్ సౌగల్‌కు తుది అవకాశం ఇచ్చింది. అయితే బ్రిటన్‌లో ఉన్న తన క్లయింటత్ మాల్యనుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో తాను ఏమీ చేయలేకపోతున్నట్లు సైగల్ కోర్టుకు చెప్పారు. దీంతో ఎంతకాలం ఎలా కొనసాగాలని వ్యాఖ్యానించిన బెంచ్ శిక్షా కాలంపై తీర్పును వాయిదా వేసింది.