Wednesday, January 22, 2025

సుప్రీంలో ఊరట

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ నడినగరంలో మహిళ రెస్లర్లు భారత రెస్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి పార్లమెంట్ సభ్యుడుపలు నేరాల గండరగండడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై సాగిస్తున్న అరణ్యరోదన మాదిరి ఆందోళన ఎట్టకేలకు వొక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు స్పందించి బ్రిజ్‌పై ఢిల్లీ పోలీసుల చేత ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయించడం బాధితులకు లభించిన తొలి మహా విజయం అనవచ్చు. అయితే సకల నీతులకు సన్మార్గాలకు పట్టుగొమ్మలమని, ఈ దేశ సర్వతోముఖ వికాసానికి ఏకైక సారధులమని రాత్రింబవళ్ళు డబ్బా వాయించుకొనే కేంద్రంలోని బిజెపి పాలకుల హృదయాలు మాత్రం ఆ నిస్సహాయ మహిళల ఎడల ఒక్క కన్నీటి చుక్క మేరకైనా కరగక పోడం బాధాకరం. వారికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో సంభవించే అన్యాయా లేమైనా ఉంటే వాటి మీదనే దృష్టి పడుతుంది గాని, తమ పాలన పరిధిలో ఎంత పెద్ద దుర్మార్గం, దౌర్జన్యం, అమానుషం జరిగిపోతున్నా చీమ కుట్టినట్టయి నా ఉండదు. ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా కనిపించదు, వినిపించదు. బ్రిజ్‌భూషణ్ శర్మ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మొరపెట్టుకొంటూ వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా, రవి దాహియా సహా ముప్పై మంది మహిళా రెస్లర్లు (మల్ల యోధులు) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జనవరి 18న మౌన ఆందోళన మొదలు పెట్టారు.

దీనితో ఏడుగురు సభ్యులతో వొక దర్యాప్తు కమిటీని భారత ఒలింపిక్ సంఘం నియమించింది. ఈ కమిటీలో ప్రఖ్యాత బాక్సర్ మేరీ కోమ్, రెస్లర్లు యోగేశ్వర్,విలువిద్య నిపుణుడు దోలా బెనర్జీ, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షు రాలు పిటి ఉష, సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ చౌబే ఉన్నారు. తగిన న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన పిటి ఉష ఇటీవల రెస్లర్లను మంద లిస్తూ ప్రకటన ఇవ్వడం ఆందోళనకారులకు పుండుమీద కారం చెల్లినట్లయింది. కమిటీ సభ్యులలో అధికులు బిజెపితో సత్సంబంధాలున్న వారని తెలుస్తున్నది. కమిటీ ఎదుట బ్రిజ్ భూషణ్ హాజరు కావడమూ జరిగిపోయింది. కాని ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకపోడంతో అందోళిత రెస్లర్లు మళ్ళీ జంతర్ మంతర్‌కు చేరుకొన్నారు. 66 ఏళ్ల బ్రిజ్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో అసాధారణ పలుకుబడి గల నాయకుడు. యుపిలో నాయకుడంటే సాధారణంగా అర్థబలం, అంగబలం ఉన్నవారే అవుతా రు తప్ప బుద్ధి బలం ఉన్న వారు బహు స్వల్పం అనడం అబద్ధం కాబోదు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడైన బ్రిజ్ ఆరు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యాడు. వొక్క 2009లో మినహా మిగతా అన్ని సార్లు బిజెపి తరపునే ఎన్నికయ్యాడు.

ప్రస్తుతం ఆ పార్టీ ఎంపిగానే ఉన్నాడు. హత్యాయత్నం సహా నాలుగు క్రిమినల్ కేసులు బ్రిజ్ భూషణ్‌పై నమోదై ఉన్నాయి. రాజకీయంగా తమకు ఎంతో ముఖ్యడైన వ్యక్తిపై చర్య తీసుకోడానికి బిజెపి పాలకులకు చేతులు రాక పోడాన్ని ఆర్ధం చేసుకోవ చ్చు. కాని దేశంలో ప్రజాస్వామ్య న్యాయానికి వీలైనంత మేరకు అభయ ప్రదాతగా నిరూపించు కొంటున్న సుప్రీం కోర్టు ఈ విషయంలోనూ తన పాత్ర నిర్వహించడం హర్షణీయం. రెస్లర్ల మొర పట్టించుకొన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఈ కేసులో ఢిల్లీ పోలీసులకు నోటీసు ఇస్తూ ఆరోపణ లు చాలా తీవ్రమైనవని అన్నారు. ధర్మాసనానికిచ్చిన మాట ప్రకారం ఢిల్లీ పోలీసులు శుక్రవారం నాడు బ్రిజ్ భూషణ్‌పై రెండు ప్రాథమిక అభియోగ పత్రాలను దాఖలు చేశారు. దీనితో ఇంత కాలం కరడుగట్టుకుపోయిన స్తబ్దతపోయి కదలిక ఏర్పడింది. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లలో వొకటి మైనర్ రెస్లర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టం కింద నమోదు చేసినది కావడం విశేషం. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే తమకు న్యాయంచేయగలదని తాము నమ్ముతున్నామని ఢిల్లీ పోలీసు లపై గాని, ప్రభుత్వం నియమించే కమిటీల మీద గాని తమకు నమ్మకంలేదని రెస్లర్లు పేర్కొనడం దేశంలో పాలకవ్యవస్థల పరువు ఎంతగా దిగజారిపోయిందో తెలియజేస్తున్నది.

అన్ని ప్రజాస్వామి క వ్యవస్థలను, నిష్పాక్షిక దర్యాప్తు సంస్థలను చెరబట్టి బిజెపి పాలకులు వికటాట్టహాసం చేస్తున్న వేళ ఏకైక ఆశాజ్యోతిగా ఉన్న న్యాయ వ్యవస్థనూ కబళించాలని వారు కుట్రపన్నుతున్నారు. కొలీజియం పై పదేపదే ధ్వజమెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నేర చరిత్ర గల నేతలు కొన్ని వందల ప్రైవేటు విద్యాసంస్థలను నడుపుతున్నారు. బ్రిజ్‌భూషణ్ యాజమాన్యం లోనూ అసంఖ్యాక సంస్థలున్నాయి. గతంలో ఒక కాలేజీ విద్యార్థినిని రేప్ చేసినందుకు యుపిలోని వొక మాజీ ఎంఎల్‌ఎకి జీవిత శిక్ష వేశారు. బ్రిజ్ భూషణ్ న్యూ ఢిల్లీలోని తన అధికార బంగ్లాలోనే రెస్లర్లపై లైంగిక దుర్మార్గాలకు పాల్ప డినట్లు మైనర్ బాధితురాలు సుప్రీం కోర్టుకు నివేదించింది. పాలకపక్షాల రక్షాకవచం ఉన్నవారు దేనికైనా తెగిస్తారనడానికి ఇది నిదర్శనం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనప్పటి కీ తాము విశ్రమించదలచలేదని రెస్లర్లు ప్రకటించారు. బ్రిజ్‌ను కటాకటాలలోకి తోసే వరకు ఊరు కోబోమని ప్రకటించారు. వారికి విజయం లభించాలి. అది భవిష్యత్తులో క్రీడా శిక్షణ తీసుకొనే మహిళలకు సైతం మేలు చేకూరుస్తుంది. దేశం పరువుకు కలిగిన అభద్రత కొంతైనా తొలగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News