Saturday, November 23, 2024

రద్దయిన చట్టం కింద కేసులు నమోదుపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

SC outraged On Cops Filing Cases Under Scrapped Section 66A Of IT Act

గత ఆరేళ్లలో దేశంలో వెయ్యికి పైగా కేసులు
సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ

న్యూఢిల్లీ : ఆరేళ్ల క్రితం 2015 లో ఐటి చట్టం లోని సెక్షన్ 66 ఎను సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ ఇంకా ఆ సెక్షన్ కింద దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు నమోదవుతుండడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామమని, దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నెటిజన్ల స్వేచ్ఛను హరించేలా ఉన్న ఐటి చట్టం సెక్షన్ 66ఎను అప్పట్లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఆ సెక్షన్ 66ఎ ను రద్దు చేస్తున్నట్టు 2015 ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని 2019 లోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇంకా అనేక చోట్ల పోలీసులు సెక్షన్ 66 ఎ కింద కేసులు నమోదు చేస్తుండడంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ సెక్షన్ కింద గత ఆరేళ్లలో దేశ వ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని దీనిపై సత్వరం చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించింది.

దీనిపై జస్టిస్ రోహింటన్ నారీమన్, కెఎం జోసఫ్, బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఇది చాలా దిగ్భ్రాంతికరం, దారుణమైన పరిణామం’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రద్దయిన చట్టం గురించి దేశం లోని అన్ని పోలీస్ స్టేషన్లకు తెలియచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సోషల్ మీడియాలో నెటిజన్లను నియంత్రించే పేరుతో 2008 లో చట్టాన్ని సవరించి 66 ఎ సెక్షన్‌ను చేర్చారు. సోషల్ మీడియా వేదికల్లో చట్ట విరుద్ధ ప్రమాదకర కంటెంట్‌ను పోస్టు చేసినట్టు రుజువైతే సంబంధిత వ్యక్తులను సెక్షన్ 66 ఎ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. దీని ప్రకారం నిందితులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించ వచ్చు.

2012 లో శివసేన చీఫ్ బాల్‌థాకరే మరణం తరువాత ముంబై బంద్ పాటించడాన్ని తప్పు పడుతూ పాల్‌గడ్‌కు చెందిన ఓ అమ్మాయి పోస్ట్ చేయగా, దానికి మరో యువతి లైక్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు , ప్రాణ రక్షణకు సమానత్వానికి హామీ ఇస్తున్న 14,19,21 అధికరణాలకు 66 ఎ సెక్షన్ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ న్యాయ విద్యార్థిని శ్రీయ సింఘాల్ సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2015 మార్చి 24న సెక్షన్ 66 ఎ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News