Monday, December 23, 2024

న్యాయమూర్తులు రోబోలా ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జడ్జి అనే వాడు న్యాయంగా, నిష్పక్షపాతంగా ఉండాలని, అయితే దాని అర్థం అతను కళ్లుమూసుకుని రోబోలాగా మౌన ప్రేక్షకుడిగా వ్యవహరించాలని అర్థం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2015లో తన ఇంట్లో టీవీ చూడడానికి వచ్చిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినందుకు ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు, పాట్నా హైకోర్టులను తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఆ మరణ శిక్షను కొట్టివేసింది. దర్యాప్తులో తీవ్రమైన లోపాలున్నాయని పేర్కొన్న సుప్రీంకోర్టు మరణ శిక్షపై పునః పరిశీలన చేయాలని కేసును తిరిగి పాట్నా హైకోరుకు పంపించింది. హైకోర్టు తనకు విధించిన మరణ శిక్షను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2015 జూన్ 1న బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాకు చెందిన గ్రామంలో టీవీ చూడడానికి వెళ్లిన బాలికపై నిందితుడు అత్యాచారం జరిపి ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు.

కేసు విచారించిన భాగల్పూర్ కోర్టు కేసు అత్యంత అరుదైన కేసుల కేటగిరీ కిందికి వస్తుందని పేర్కొంటూ నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా దీనిపై నిందితుడి అపీలును పాట్నా హైకోర్టు 2018లో కొట్టివేస్తూ, మరణ శిక్షను ధ్రువీకరించింది. అయితే మొత్తం దర్యాప్తులో తీవ్రమైన లోపాలున్నాయని, చివరికి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా తీసుకోలేదని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, పర్దీవాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేవలం నిందితుడు బాధితురాలి ఇంటికి వచ్చి, టీవీ చూడడానికి తన ఇంటికి ఆమెను తీసుకెళ్లాడనే వాదన ఆధారంగానే ట్రయల్ కోర్టు, పాట్నా హైకోర్టు ముందుకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. మరో నిందితుడైన బాల నేరస్థుడు బాధితురాలి ఇంటికి వచ్చి తనతో ఆ బాలికను తీసుకెళ్లాడని సాక్షులందరూ పోలీసులకు చెప్పారు. అయితే డిఫెన్స్ న్యాయవాది కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ట్రయల్ కోర్టు,

చివరికి హైకోర్టు కానీ ఈ విషయాన్ని ముఖ్యమైన అంశంగా పరిగణించకపోవడం ఆశ్చర్యంగా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. ఇది రేప్, హత్య కేసు అయినందున ట్రయల్ కోర్టు జడ్జి అన్ని విషయాలను, ముఖ్యమైన ప్రాసిక్యూషన్ సాక్షులు చెప్పిన విషయాలను ్రంత్తగా పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని బెంచ్ పేర్కొంది. అమాయకుడు శిక్షించబడనప్పుడు, దోషికి శిక్ష పడినప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్లని బెంచ్ వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News