Monday, December 23, 2024

‘రాజద్రోహం’పై పిటిషన్లు… రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వలసపాలన నాటి రాజద్రోహం (ఐపీసీ 124 ఏ సెక్షన్) (సెడిషన్) రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. కనీసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుందని తెలిపింది. ప్రస్తుతం శిక్షాస్మృతి నిబంధనల్లో మార్పులు చేర్పులు చేపడుతున్న నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయడాన్ని వాయిదా వేయాలన్న కేంద్రం అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా , జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సంబంధిత పత్రాలను సీజేఐ ఎదుట ఉంచాలని , తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది.

భారత శిక్షాస్మృతిని పునఃపరిశీలించడంపై సంప్రదింపులు కీలక దశలో ఉన్నాయని కేంద్రం చెప్పడంతో మే 1న ఈ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమం లోనే ఆగస్టు 11న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టారు. రాజద్రోహ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఈ క్రమం లోనే సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెలువరించింది. ఇదిలా ఉండగా, రాజద్రోహం సెక్షన్‌ను సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ 16 నెలల క్రితమే నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీసీలోని సెక్షన్ 124 ఎ కింద ఎలాంటి కేసులూ నమోదు చేయొద్దని, వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని ఆయన గత ఏడాది మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News