న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ సహా, ఇతర బోర్డులు ఈ ఏడాది నిర్వహించే 10, 12వ తరగతి ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తాయని, తప్పుడు విశ్వాసం కలిగిస్తాయని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నాం. ఇప్పటికే అధికారులు, ఈ పరీక్షల తుది తేదీలను ప్రకటించారు. ఆమేరకు ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు. ఆ తేదీలతో ఏమైనా సమస్యలుంటే అప్పుడు పిటిషనర్లు ఆయా అధికారులను సంప్రదించవచ్చు అని ధర్మాసనం స్పస్టం చేసింది. కరోనా ఇంకా పూర్తిగా తొలగనందుకు 10, 12వ తరగతి బోర్డు ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూఏ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందుకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఫలితాలు ప్రకటించేలా సిబీఎస్‌ఈ, ఇతర బోర్డులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో గత ఏడాది సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా దాదాపు అన్ని రాష్ట్రాల బోర్డులు 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ దఫా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏర్పాట్లు మొదలు పెట్టాయి. సీబీఎస్‌ఈ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 10, 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
SC Refused to cancel board exams of 10 and 12 Classes