Monday, December 23, 2024

సిఇసి, ఇసిల నియామకం చట్టంపై స్టేకు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి సభ్యత్వం లేని కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసిల) నియామకానికి వీలు కల్పిస్తున్న కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది. ఒక ఎన్‌జిఒ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం నోటీస్ జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్‌లతో పాటు ఈ పిటిషన్‌ను ఏప్రిల్‌లో విచారిస్తామని బెంచ్ తెలియజేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, ఉద్యోగ నిబంధనలు, పదవీ కాల పరిమితి చట్టం 2023 రాజ్యాంగ బద్ధతను ఈ పిటిషన్ సవాల్ చేసింది.

సిఇసి, ఇసిలను నియమించే కమిటీలో సిజెఐ ఉండాలని ఆదేశించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు ఈ చట్టం విరుద్ధమని ఎన్‌జిఒ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదవీ విరమణ చేయబోతున్నారని, ఈ చట్టం అమలుపై స్టే ఇవ్వని పక్షంలో తమ పిటిషన్ అసంబద్ధం అవుతుందనిఆయన వాదించారు. ‘సారీ, మేము ఈ వ్యవహారంలో మీకు మధ్యంతర స్టే మంజూరు చేయజాలం. రాజ్యాంగ బద్ధత ఎన్నడూ అసంబద్ధం కాదు. మధ్యంతర స్టే మంజూరుకు మా కొలబద్దలు మాకు తెలుసు’ అని బెంచ్ మధ్యంతర స్టే కోసం పట్టుబట్టిన ప్రశాంత్ భూషణ్‌తో చెప్పారు.

‘(ఎ) ప్రధాని = చైర్‌పర్సన్, (బి) ప్రజా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష నేత = సభ్యుడు, (సి) ప్రధాని నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి = సభ్యుడుతో కూడిన సెలక్షన్ కమిటీ సిపార్సుపై ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలి’ అని కొత్త చట్టం నిర్దేశిస్తోంది. భారత రాజ్యాంగంలోని 324 (2) అధికరణం కింద ఖాళీని భర్తీ చేసేందుకు గాను చట్టాన్ని 2023లో చేశారు అని పిటిషన్ పేర్కొన్నది. ‘అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ల నియామకాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే జరుపుతుందన్న పూర్వపు చట్టం నిబంధనను సదరు సెక్షన్ పునరుద్ధరిస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ సభ్యులు అంటే ప్రధాని, ఆయన నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి సెలక్షన్ కమిటీలో ఆధిపత్యం వహిస్తారు’ అని పిటిషన్ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News