న్యూఢిల్లీ: కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి డికె శివకుమార్‌పై చేపట్టిన దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను తొలగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను సవాలు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీన్ని జస్టిస్‌అనిరుద్ధ బోస్, బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. సిబిఐ అప్పీలుపై సమాధానం కోరుతూ డికె శివకుమార్‌కు ధర్మాసనం నోటీసు జారీచేసింది.
కాగా, డికె శివకుమార్‌పై చేపట్టిన సిబిఐ దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని గత జులైలో సిబిఐ సవాలు చేయగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అవినీతి కేసులో సిబిఐ దర్యాప్తును నిలిపివేస్తూ ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిఎంఎల్‌ఎ కింద నమోదు చేసిన కేసులో తీసుకున్న చర్యలేమిటో తెలియచేస్తూ నివేదిక ఇవ్వాలని కూడా అప్పట్లో సిబిఐని హైకోర్టు ఆదేశించింది. 2017లో ఆదాయం పన్ను శాఖ సోదాలు నిర్వహించి శివకుమార్‌పై అవినీతి కేసును నమోదు చేసింది.