Thursday, November 21, 2024

సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

SC refuses to scrap HC order on oxygen supply to K'taka

ఆక్సిజన్ సరఫరాపై కర్నాటక హైకోర్టు ఆదేశాల్లో
జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కర్నాటకకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ ఆక్సిన్ సరఫరా కోటాను పెంచాలన్న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. హైకోర్టు అత్యంత జాగ్రత్తగా ఉత్తర్వులు ఇచ్చిందని, వీటిని తిరస్కరించి కర్నాటక ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణమేదీ తమకు కనిపించలేదని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసనం తేల్చిచెప్పింది.

హైకోరర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. రాష్ట్రానికి రోజువారీ ఆక్సిజన్ సరఫరాను 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కర్నాటక హైకోర్టు ఈ నెల 5న కేంద్రాన్ని ఆదేశించింది. అయితే 965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కర్నాటకకు సరఫరా చేస్తున్నామని, దీన్ని పెంచలేమని, ఈ ఆదేశాలను నిలిపివేయాలంటూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రతి హైకోర్టు ఇలా ఆదేశాలు ఇవ్వడం మొదలుపెడితే కష్టమని కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. కర్నాటక ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే హైకోర్టు బాగా ఆలోచించి జాగ్రత్తగా చక్కటి ఆదేశాలు ఇచ్చిందంటూ సుప్రీంకోర్టు కేంద్రం వాదనలను తోసిపుచ్చింది.

ఢిల్లీకి 700 టన్నులు సరఫరా చేయాల్సిందే

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయిన కరోనా కేసులను ఎదుర్కోవడానికి నగరంలోని ఆస్పత్రులన్నీ పోరాటం చేస్తున్నాయని, అందువల్ల తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నగరానికి రోజూ 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసి తీరాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. దేశ రాజధానిలో ఆక్సిజన్ సరఫరాలో లోటుపై ఢిల్లీ ప్రభుత్వం చేసిన వాదనను జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయకపోతే సంబంధిత అధికారులపై తగు ఆదేశాలు జారీ చేస్తామని బెంచ్ తెలిపింది. కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన మెడికల్ ఆక్సిజన్ కొరతపై సుప్రీంకోర్టు చర్చించడం వరసగా ఇది మూడో రోజు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News