Monday, December 23, 2024

జ్ఞానవాపి సర్వేపై స్టే కుదరదు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఆర్కియాలాజికల్ సర్వే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. సర్వేపై అలహాబాద్ హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎఎస్‌ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించవచ్చునని హైకోర్టు ఆదేశాలు వెలువరించి ఉంది. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో శివమందిరం ఉండేదని, దీనిపైనే తరువాత ముస్లిం మత ప్రార్థనాస్థలం నిర్మించారని హిందూపక్షం వాదిస్తోంది. దీనిని ముస్లిం ప్రతినిధులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రస్తుత వివాదం కోర్టులలో వ్యాజ్యాలకు దారితీసింది. ఈ 17వ శతాబ్ధపు కట్టడం నిజస్వరూపం తేల్చుకునేందుకు ఎస్‌ఐఎ ద్వారా శాస్త్రీయ అధ్యయనం ప్రతిపాదన వచ్చింది. అయితే సర్వే పేరిట జరిగే ప్రక్రియ వల్ల మసీదు కట్టడాలకు విఘాతం ఏర్పడుతుందని, గత గాయాలను తిరిగి రేపినట్లు అవుతుందని ముస్లిం పక్షాలు వాదించాయి.

సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలనే వీరి అభ్యర్థనను సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తన రూలింగ్ క్రమంలోనే ఐఎస్‌ఐకు నిర్థిష్ట సూచనలు వెలువరించింది. సర్వే దశలో ఎటువంటి అతిక్రమణలకు పాల్పడరాదని, కేవలం శాస్త్రీయ సర్వే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సర్వే దశలో ఎటువంటి తవ్వకాలు ఉండవని, ఇప్పటి నిర్మాణం దెబ్బతినబోదని సర్వే సంస్థ వారు సొలిసిటర్ జనరల్ ద్వారా పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు, వీటికి కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుందని తెలియచేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్థిష్ట రూలింగ్‌తో ఇప్పుడు జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వేకు రంగం సిద్ధం అవుతోంది.

ఇక ఇప్పుడు ఎఎస్‌ఐ ద్వారా అధ్యయనం సాగించేందుకు వీలు కల్పించినా పేర్కొన్న విధంగా శాస్త్రీయ సర్వే జరిగిందా? అవకతవకలు, అతిక్రమణలకు దిగారా? అనేది సంబంధిత పక్షం ఎవరైనా కోర్టు ద్వారా తేల్చుకోవచ్చు.దీనిపై అభ్యంతరాలకు వీలుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌కు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఎఎస్‌ఐ ద్వారా సర్వే తదనంతర నివేదికతోనే ప్రస్తుత వివాదాస్పద అంశాలను నిర్థారించుకునేందుకు వీలుంటుందని భావించరాదని, సర్వే నివేదికలోని అంశాలను పరిశీలించుకుని తరువాత తుది తీర్పు వెలువరించడం న్యాయస్థానం బాధ్యతగా ఉంటుందని తెలిపారు. శాస్త్రీయ సర్వే నివేదికను తొలుత ట్రయల్ కోర్టుకు అందించాల్సి ఉంటుందని, దీనిని బట్టి జిల్లా జడ్జి తగు నిర్ణయం తీసుకుంటారని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News