న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన ఎన్నికల చిహ్నాలను ఎవరికీ కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
బిఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను స్వీరకరించడానికి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించడానికి. తమ పార్టీకి చెందిన కారు చిహ్నాన్ని పోలిన రోడ్డు రోలర్ వంటి చిహ్నాలను ఇతర పార్టీలకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని బిఆర్‌ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. రోడ్డు రోలర్ వంటి చిహ్నాలు ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తాయన్న బిఆర్‌ఎస్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కారుకు, రోడ్డు రోలర్‌కు మధ్య తేడాను కనిపెట్టగల తెలివితేటలు ఓటర్లకు ఉంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ వేశారా అంటూ బిఆర్‌ఎస్ పార్టీ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
కాగా..ఇదే అభ్యర్థనతో బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కూడా తోసిపుచ్చింది. తమ పార్టీ చిహ్నం కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా వంటి చిహ్నాల కారణంగా గతంలో తమ పార్టీ అభ్యర్థులు కొందరు ఓట్లను కోల్పోవలసి వచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు.