న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ‘పబ్లిక్ రిక్రియేషనల్ జోన్’పై ప్రభావం చూపుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టి వేసింది. మనం ప్రతిదాన్ని విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి అంటూ కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇక్కడ ప్రైవేట్ ఆస్తిని సృష్టించడం లేదు. ఉపరాష్ట్రపతి నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ పచ్చదనం ఉంటుంది. ఈ ప్రణాళికకు ఇప్పటికే అధికారులు ఆమోదం తెలిపారు అంటూ సుప్రీం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు కారణంగా కొన్ని ప్రాంతాలను ‘పబ్లిక్ రిక్రియేషనల్ నుంచి రెసిడెన్షియల్‌గా మార్చారని ఆరోపిస్తూ.. రాజీవ్ సూరి అనే సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారు. దానివల్ల ప్రస్తుతం ప్రజల వినోదం కోసం ఉద్దేశించిన ప్రాంతంపై ప్రభావం పడుతుందని వాదించారు.
అయితే అభివృద్ధి ప్రణాళికలో మార్పులు చేయడం అనేది విధానపరమైన విషయమని కోర్టు పిటిషన్‌దారునికి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని నడిబొడ్డున 3.2 కిమీ విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే ఏడాది భారత్ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోనున్న నేపథ్యంలో అప్పటికల్లా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్షం పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటు భవనం, మంత్రిత్వశాఖ కార్యాలయాలను పునర్నిర్మిస్తున్నారు.
SC Rejects Petition on Central Vista