న్యాయ వృత్తికి పరిపక్వత గల వ్యక్తులు అవసరమని సుప్రీంకోర్టు సోమవారం అభిప్రాయపడింది. 12వ తరగతి తర్వాత ప్రస్తుతమున్న ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుకు బదులుగా మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సును ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ)కు ఆదేశౠలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి (బ్యాచిలర్ ఆఫ్ లా) కోర్సు బాగానే పనిచేస్తోందని, దానిలో మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ లేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అసలు మూడేళ్ల కోర్సు అవసరం ఏమిటి? హైస్కూలు పూర్తి చేసుకున్న వెంటనే ప్రాక్టీసు(న్యాయవాద) ప్రారంభించేస్తారు. నా దృష్టిలో ఐదేళ్లు కూడా చాలా తక్కువే అని సిజెఐ వ్యాఖ్యానించారు.
న్యాయవాద వృత్తిలోకి మరింత పరిపక్వత చెందిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉందని, ఐదేళ్ల కోర్సు చాలా లాభదాయకమైనదని ఆయన చెప్పారు. పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌కు ధర్మాసనం అనుమతించింది. న్యాయవాది, పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ హాజరయ్యారు. బ్రిటన్‌లో లా కోర్సు మూడేళ్లు మాత్రమేనని, భారత్‌లో ఉన్న ఎల్‌ఎల్‌బి కోర్సు పేదలకు ముఖ్యంగా బాలికలకు కష్టతరంగా మారిందని వికాస్ సింగ్ తెలిపారు. అయితే ఈ వాదనలతో సిజెఐ ఏకీభవించలేదు. ఈసారి జిల్లా న్యాయవ్యవస్థలో 70 శాతం మంది మహిళలు ప్రవేశించారని, పెద్ద సంఖ్యలో బాలికలు లా కోర్సులో చేరుతున్నారని సిజెఐ తెలిపారు. పిల్‌ను ఉపసంహరించుకోవడానికి కోర్టు అనుమతి కోరిన వికాస్ సింగ్ మూడేళ్ల కోర్సును ప్రవేశపెట్టేందుకు బిసిఐకి వినతిపత్రం సమర్పించే అవకాశం కల్పించాలని కోరారు. అయితే పిల్‌ను ఉపసంహించుకోవడానికి అనుమతి ఇచ్చిన కోర్టు బిసిఐకి వినితిపత్రం సమర్పించడానికి అనుమతించలేదు.