వికెసింగ్‌పై పిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో నుంచి ఎ మంత్రిని అయినా తీసివేసే అంశం ప్రధాని పరిధిలోకి వస్తుంది. ఈవిషయాన్ని ఆయనే చూసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంత్రి పనితీరు బాగా లేకున్నా, వివాదాస్పదం అయినా దీనిపై నిర్ణయం తీసుకునే తుదిబాధ్యత మంత్రిమండలి సారథిగా ప్రధాన మంత్రి తీసుకుంటారు. ఈవిషయంలో న్యాయస్థానాలు ఏమీ చేయలేవని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తెలిపింది. కేంద్రం నిర్ణయాలను, ఆర్మీని కించపరిచే విధంగా కేంద్రమంత్రి వికె సింగ్ మాట్లాడారని ఆయనను బర్తరఫ్ చేయాలని దాఖలైన ప్రజావ్యాజ్యాన్ని కొట్టివేసిన న్యాయస్థానం ఇటువంటి పిటిషన్లకు దిగవద్దని చురకలు పెట్టింది.
హక్కుల ఉద్యమకర్త, సైంటిస్టు అయిన తమిళనాడుకు చెందిన చంద్రశేఖరన్ రామస్వామి ఈ పిటిషన్ వేశారు. రిటైర్డ్ ఆర్మీ జనరల్, కేంద్రంలో ఇప్పుడు మంత్రి అయిన వ్యక్తి చైనా ఆక్రమణను సమర్థించే విధంగా ఫిబ్రవరి 7వతేదీన ప్రకటన చేశారని, మంత్రిగా తన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించారని వెంటనే పదవి నుంచి తొలిగించాలని పిటిషనర్ కోరారు. అయితే ఇది న్యాయస్థాన పరిధికి రాదని, సైంటిస్టు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టకుండా విలువైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆధ్వర్యపు ధర్మాసనం తెలిపింది. చైనాతో సరిహద్దుల వివాదం దశలో ఫిబ్రవరిలో సింగ్ స్పందిస్తూ ‘ చైనాతో భారత్ సరిహద్దుల గుర్తింపు జరగలేదు. ఇక చైనా అతిక్రమణల అంశం వస్తోంది సరే. అయితే మనం ఎన్నిసార్లు అతిక్రమించాం. ఇవి లెక్కలోకి రావు. చైనా పది సార్లు అతిక్రమించి ఉంటే, మనం కనీసం 50 సార్లు ఇదేపని చేసిఉంటాం. ఇక దూకుడు అంశంఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎల్‌ఎసికి సంబంధించి నా దృక్పథం’ అన్నారు. వివాదానికి తెరతీశారు.