న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం రిజర్వ్ చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్ , వివిధ రాష్ట్రాల తరఫున వాదించిన సీనియర్ లాయర్లు సహా అన్ని పక్షాల వాదనలను బెంచ్ వినింది. స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినప్పటికీ ఎస్‌సిలు, ఎస్‌టిలకు చెందిన వారి జీవితాలు అగ్రకులాలకు చెందిన వారి స్థాయికి రాలేదనేది వాస్తవమని ఇంతకు ముందు వాదనల సందర్భంగా కేంద్రం బెంచ్‌కి తెలియజేసింది గ్రూపు ఎ కేటగిరీలో ఎస్, ఎస్‌టిలకు చెందిన వారు ఉన్నత పదవి పొందడం చాలా కష్టమని, ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్‌ఎస్‌లు, ఎస్‌టిలు, ఇతర వెనుకబడిన వర్గాలకు(ఒబిసి) కొంత బలమైన పునాదిని సుప్రీంకోర్టు ఇవ్వాలని అటార్నీ జనరల్ వేణు గోపాల్ బెంచ్ ముందు వాదించారు .అయితే ఎస్‌సిలు, ఎస్‌టిలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంపై ఇంతకు ముందు తాము ఇచ్చిన తీర్పును తిరిగి తెరవాలని అనుకోవడం లేదని, రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనేది నిర్ణయించాల్సింది రాష్ట్రాలేనని బెంచ్ స్పష్టం చేసింది.