గోప్యత హక్కు కీలకం: సుప్రీం
న్యూఢిలీ : ఇష్టపడని వ్యక్తికి డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం అనుచితం అవుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. బలవంతపు డిఎన్‌ఎ టెస్టులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం అవుతాయి. గోప్యతా హక్కును కాలరాస్తాయని న్యాయమూర్తులు ఆర్ సుభాష్ రెడ్డి, హృషికేశ్‌రాయ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. డిఎన్‌ఎ టెస్టులకు ఏదో ఆషామాషీగా ఆదేశించరాదు. జన్యుక్రమాన్ని తెలిపే ఈ పరీక్షలకు గురిచేసే ముందు సదరు వ్యక్తుల అంగీకారం పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య సంబంధాలను తెలిపేందుకు రక్తపు నమూనాల పరీక్షలకు దిగడం జరుగుతోంది. వావివరసల వ్యాజ్యాలలకు సంబంధించి ఇతరత్రా ఆధారాలు ఉన్నట్లు అయితే వాటికే కోర్టులు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతర మార్గాలు లేనప్పుడే డిఎన్‌ఎ పరీక్షకు దిగాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కవలలు మినహాయిస్తే ప్రతి వ్యక్తిలో డిఎన్‌ఎ విభిన్నంగా ఉంటుంది. ఇదే డిఎన్‌ఎ విశిష్టత. వ్యక్తుల పూర్వాపరాలు ఏకంగా వ్యక్తి ఉనికిని తెలిపే గుర్తింపును తేల్చేందుకు డిఎన్‌ఎ ఉపయోగపడుతుంది. దీనిని కాదనలేం.
కుటుంబ బాంధవ్యాలు, సునిశిత ఆరోగ్య సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది. అయితే అత్యవసర ప్రాతిపదికన అనివార్యంగా డిఎన్‌ఎ పరీక్షలకు గురి చేసే వ్యక్తుల విషయంలో ఇటువంటి సందర్భాలలో ఇంతకు ముందు న్యాయస్థానం నిర్ధేశించిన సముచిత రీతి పరీక్ష నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కెఎస్ పుట్టస్వామి , కేంద్ర ప్రభుత్వం మధ్య సాగిన వ్యాజ్యంలో పేర్కొన్న విషయాలను ధర్మాసనం ప్రస్తావించింది. గోప్యత రాజ్యాంగపరమైన హక్కు అని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించాల్సి ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపిందని ధర్మాసనం గుర్తు చేసింది. అశోక్‌కుమార్ అనే వ్యక్తి దివంగత ట్రిలోక్ చంద్ గుప్తా, సోనాదేవీలకు చెందిన ఆస్తులు తనకే చెందుతాయని, తననే యజమాని అని ప్రకటించాలని వేసిన పిటిషన్‌పై ధర్మాసనం తీర్పు వెలువరించింది. డిఎన్‌ఎ పరీక్ష విషయంలో రాజ్యాంగపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీరాలని స్పష్టం చేసింది.