Sunday, November 24, 2024

బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

supreme court

లైంగిక దాడికి ‘స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్’ ఉండాల్సిన అవసరంలేదని తాజా తీర్పు!

న్యూఢిల్లీ: ‘బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్టం 2012 క్రింద లైంగిక వేధింపుల కిందకు రాదు’ అంటూ ఇదివరలో బాంబే హైకోర్టు ఇచిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం కూడా లైంగిక వేధింపేనని స్పష్టంచేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టానికి సంకుచిత వివరణ ఇచ్చేలా ఉందని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. నేరస్థుడు తప్పించుకునేందుకు చట్టం అనుమతించదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు రవీంద్ర భట్, బేలా ఎం త్రివేది కూడా ఉన్నారు.
“చట్టాలు స్పష్ఠమైన ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు…న్యాయస్థానాలు ఆ నిబంధనల్లో గందరగోళం సృష్టించకూడదు. సందిగ్ధతను సృష్టించడంలో న్యాయస్థానాలు అత్యుత్సాహం చూపడం సరికాదు. ఇక్కడ పోక్సో చట్టం లక్షం చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో బాలికను తాకినప్పుడు అది నేరం కిందే లెక్క . నేరస్థుడు శరీరాన్ని నేరుగా స్పృశించాడా లేదా దుస్తులపై నుంచి తాకాడా అన్నది అనవసరం” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

కేసు పూర్వరంగంలో ఏమి జరిగింది?
సతీశ్ అనే వ్యక్తి 2016లో పండు ఇస్తానని ఆశపెట్టి ఓ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి అక్కడికి వచ్చింది. దీనిపై కేసు నమోదుకాగా, సెషన్స్ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా పేర్కొంటూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ నాగ్‌పూర్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. ఓ బాలిక శరీరాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని మహిళా న్యాయమర్తి పుష్పగనేడివాల పేర్కొన్నారు. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు. కాగా ఈ తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయనిపుణులు ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఈ తీర్పును నిలిపివేయాలంటూ అటారీ జనరల్‌తోపాటు జాతీయ కమిషన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జనవరి 27న బాంబే హైకోర్టు తీర్పును నిలిపేసింది. తాజాగా ఇప్పుడు దానిని కొట్టివేసినట్లు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News