Monday, December 23, 2024

మణిపూర్‌పై త్రిసభ్య మహిళా కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నిండా ఘర్షణల్లో కూరుకుపోయిన మణిపూర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు హైకోర్టు మాజీ మహిళాన్యాయమూర్తులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సంబంధిత కమిటీ రాష్ట్రంలో బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిణి గీతా మిట్టల్, రిటైర్డ్ న్యాయమూర్తులు షాలినీ పి జోషీ, ఆశామీనన్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. రాష్ట్రంలో చట్టపరమైన పాలన, ప్రజలలో విశ్వాసం తిరిగి నెలకొనేలా చేయడమే అత్యున్నత న్యాయస్థానం ఆలోచన అని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్న ఈ ధర్మాసనం తెలిపింది. మణిపూర్‌లో ఇప్పటి పరిస్థితిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేకించి అక్కడ ఇద్దరు మహిళలను వివస్త్రలు చేసి ఊరేగించిన ఘటనపై అధికార యంత్రాంగానికి చివాట్లు పెట్టింది.

సంబంధిత ఘటనపై ఇప్పుడు ప్రభుత్వం స్థానిక పోలీసు బృందంతో దర్యాప్తునకు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించింది. అల్లరిమూకలకు బాధితులను అప్పగించి తమాషా చూసిన వారికి దర్యాప్తు బాధ్యత ఇవ్వడం అవివేకం అవుతుందని ఆక్షేపించింది. ఈ క్రమంలో తామే సంబంధిత విషయంలో స్పందిస్తామని తెలిపిన ధర్మాసనం ఇప్పుడు మహిళా బాధితులను పరిగణనలోకి తీసుకుని అంతా మహిళలే ఉండే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జుడిషియల్ కమిటీ పలు రకాల బాధ్యతలు చేపడుతుంది. ప్రత్యేకించి బాధితులకు సహాయ పునరావాస పనులు పర్యవేక్షించడం చేస్తారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలను సమన్వయపరుస్తారు. రాష్ట్ర సిట్ ద్వారా క్రిమినల్ కేసులపై జరిగే దర్యాప్తునకు సీనియర్ పోలీసు అధికారుల నుంచి తగు విధమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ త్రిసభ్య కమిటీ పరిధిలోకి వచ్చే విషయాలపై సమగ్ర సమాచారాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి.

తమ ఆదేశాల వివరాలను కూడా ఇందులో జతచేస్తారు. బాధితుల తరఫున దాఖలైన పిటిషన్ల విచారణ క్రమంలో మణిపూర్ డిజిపి రాజీవ్ సింగ్ న్యాయస్థానానికి హాజరయ్యారు. తెగల మధ్య ఘర్షణలపై ధర్మాసనం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వీటిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం తరఫున తీసుకుంటున్న చర్యలను తెలిపారు. కేసులను వేర్వేరుగా వర్గీకరించి దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా హాజరయ్యారు. కేసుల వివరాలను తెలియచేస్తూ తమ నివేదికలను అందించారు. ప్రభుత్వం పూర్తి పరిణతితో ఎప్పటికప్పుడు పరిస్థితిని తగు విధంగా కంట్రోల్ చేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తుందని, వీటికి జిల్లా స్థాయిల్లో ఎస్‌పిలు నాయకత్వం వహిస్తారని తెలిపారు. సిబిఐ ద్వారా 11 కేసుల దర్యాప్తు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News