Thursday, December 19, 2024

కర్నాటకలో ఎస్‌సి/ఎస్‌టి కోటా పెంపు

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో ఎస్‌సి/ ఎస్‌టి కోటా పెంపు
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ..
రాజ్యాంగబద్ధతకు చర్యలు
రాష్ట్రంలో ఇక రిజర్వేషన్లు 56 శాతం
బెంగళూరు: కర్నాటకలో ఎస్‌సి/ఎస్‌టి రిజర్వేషన్ల పెంపుదల నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి శనివారం తుది ఆమోదం తెలిపింది. దీనితో ఎస్‌సిలకు ఇప్పటివరకూ ఉన్న 15 శాతం కోటా ఇకపై 17 శాతానికి పెరుగుతుంది. ఇదే విధంగా ఎస్‌టికోటా ఇప్పుడున్న 3 శాతం నుంచి 7 శాతానికి చేరుతుంది. సంబంధిత కోటా పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే కార్యాచరణ ఆర్డర్ వెలువరిస్తుంది. అయితే సంబంధిత కోటా హెచ్చింపు ప్రక్రియకు రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. కోటా పెంపును రాజ్యాంగంలోని 9వ అధికరణలో చేర్చేలా నిర్ధేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. నేటి కేబినెట్ భేటీ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విలేకరులతో మాట్లాడారు. కోటా పెంపునకు సంబంధించి తాము శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా కోటా పెంపుదలను ప్రతిపాదిస్తూ జస్టిస్ హెచ్‌ఎన్ నాగమోహన్ దాస్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించడం జరిగిందని తెలిపారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కోటా పెంపుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తక్షణమే దీనిపై ఆర్డర్‌ను, గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

తాము తీసుకున్నది కేవలం ఆషామాషీ నిర్ణయం కాదని, దీనికి రాజ్యాంగపరమైన చట్టబద్ధత కల్పించేందుకు కూడా అన్ని స్థాయిలలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేకించి దీనిని 9వ షెడ్యూల్‌లో చేర్చడం, సంబంధిత న్యాయ ప్రక్రియలను పూర్తి చేయడం, రాజ్యాంగ, చట్ట న్యాయ నిపుణులతో అడ్వకేట్ జనరల్ ద్వారా చర్చలు జరిపించడం, తరువాత కేంద్రానికి కోటా సిఫార్సులు పంపించడం జరుగుతుందని తెలిపారు. పూర్తిస్థాయిలో ఈ నిర్ణయం అమలుకు పాటుపడుతామని చెప్పారు. ప్రస్తుతం కర్నాటకలో ఒబిసిలకు 32శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇక ఎస్‌సిలకు 15, ఎస్‌టిలకు 3శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 50శాతం పరిమితిలోనే కోటా ఉంది. అయితే ఇప్పుడు కోటా పెంపుదల నిర్ణయంతో రిజర్వేషన్ల కోటా 56శాతం అవుతుంది. కోటా పరిమితి సుప్రీంకోర్టు నిర్ధేశిత ఆదేశాల మేరకు 50 శాతంగానే ఉండాలి. దీనిని అధిగమించాలంటే కర్నాటక రాష్ట్రానికి 9వ షెడ్యూల్ మార్గం ఒక్కటే అవకాశంగా ఉంది. దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ దశలో కేంద్రం, పార్లమెంట్ ప్రధాన భూమిక పోషిస్తాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్నాటకలో కోటా పెంపుదలను గట్టిగా అమలుచేయాలని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం తలపెట్టింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అలేమరి (దేశ సంచారులు) తెగల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.

SC/ST Quota increased in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News