Monday, December 23, 2024

ఉప ప్రణాళికపై ఉదాసీనత

- Advertisement -
- Advertisement -

షెడ్యూల్డు కులాలు, తెగల అభ్యున్నతి, సామాజిక భద్రతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగం) చట్టం -2013 తెచ్చారు. ఈ చట్టం ప్రకారం అన్ని శాఖలకు ప్రభుత్వ కేటాయింపుల్లో 16.4 శాతం నిధులను ఎస్‌సిలకు, 6.6 శాతం నిధులు ఎస్‌టిలకు జనాభా ప్రకారం ఖర్చు చేయాలి. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత కేటాయింపులు మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎస్‌సిలకు 16.4, ఎస్‌టిలకు 5.3 శాతం, తెలంగాణలో ఎస్‌సిలకు 15.45, ఎస్‌టిలకు 9.3 శాతం చొప్పున అభివృద్ధి వ్యయాన్ని బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంది. చట్టం అమలులోకి వచ్చి 2023 జనవరి 24 నాటికే పదేళ్లు గడిచింది. దాని అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు నేటికీ ఎస్‌సి, ఎస్‌టిలకు చేసింది అంతంత మాత్రమే. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక చట్టం ద్వారా బడ్జెట్ కేటాయింపుల్లో 2011 జనాభా లెక్కలను కాకుండా 2001 లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నారు. అంటే పదేళ్లలో పెరిగిన జనాభాను విస్మరించారు. చట్టం అమలుకు పదేళ్ల కాలపరిమితి విధించారు. చట్టం అమలు అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి తప్ప, కాలపరిమితితో సాధించేది ఏమీ ఉండదని ఇవి తేటతెల్లం చేస్తున్నాయి.

సాధారణ పథకాల ఖర్చును సైతం ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలో చూపించే అవకాశం కల్పించడం ఈ చట్టంలోని మరో లొసుగు. ఉపాధి హామీ పథకంలో పని చేసే ఎస్‌సి, ఎస్‌టిల మళ్ళింపు వల్ల తీరని నష్టం జరుగుతోంది. వారికి ఇచ్చే వేతనం, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజలకు ఇచ్చే పింఛన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాల’ ను ఉప ప్రణాళిక బడ్జెట్ ఖర్చుగానే చూపుతున్నారు. ఇది ఆ వర్గాలకు అన్యాయం చేయడమే. ఆర్థిక సంవత్సరంలో ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలకు కేటాయించిన బడ్జెట్లో మిగిలిన మొత్తం మురిగిపోయేలా చట్టం చేశారు. మిగులు బడ్జెట్ ను వచ్చే ఏడాది కేటాయింపులకు కలపాలన్న సూచనలను గాలికి వదిలేశారు.

2017- 22 మధ్య ఆయిదేళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి వ్యయ బడ్జెట్ రూ. 5,89,309 కోట్లు. అందులో 16.4 శాతం (రూ. 96,647 కోట్లు) ఎస్‌సిలకు వెచ్చించాలి. కానీ రూ. 69,213 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రత్యేకంగా ఎస్‌సిలకు ఉద్దేశించిన (లక్షిత) పథకాలకు రూ. 27,394 కోట్లే వ్యయం చేశారు. ఎస్‌టిలకు 5.3 శాతం (రూ.31,233 కోట్లు) వెచ్చించాల్సి ఉండగా, రూ. 24,003 కోట్లు కేటాయించారు. అయిదేళ్లకు అభివృద్ధి రూ. 4,97,719 కోట్లు. అందులో 15.45 శాతం (రూ. 58.003 కోట్లు) ఎస్‌సిలకు కేటాయించాలి. రూ.81,070 కోట్లు కేటాయించి లక్షిత పథకాలకు రూ. 31,825 కోట్లు ఖర్చు చేశారు. ఎస్‌టిలకు 9.3 శాతం (రూ.48,288 కోట్లు) బదులు రూ. 79 కోట్లు కేటాయించారు. లక్షిత పథకాలకు రూ.18,915 కోట్లు వ్యయం చేశారు.

నిరుపేద ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు మండలాన్ని ప్రామాణికంగా తీసుకొని అక్కడ ఉన్న బెస్ట్ కార్పొరేట్ స్కూల్‌ను గుర్తించి ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను ఆ స్కూల్లో చదివించేందుకు అయ్యే ఖర్చును సబ్ ప్లాన్ నిధుల ద్వారా మంజూరు చేసేందుకు ఉద్దేశించిన పథకం ‘బెస్ట్ అవైలబుల్ స్కీం’ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. ఇతర దేశాల్లో డిగ్రీ అనంతర విద్యను చదువుకునేందుకు విద్యోన్నతి పథకం ద్వారా ఆ ప్రభుత్వం చేయూత నిచ్చింది. మెరిట్ అప్ గ్రడేషన్, స్కిల్ అప్ గ్రడేషన్, బుక్ బ్యాంక్ వంటి పథకాల ద్వారా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, అలాగే కేంద్ర నిధుల ద్వారా స్వయం ఉపాధి పథకాలు గతంలో అమలు జరిగాయి. ఎస్‌సి, ఎస్‌టిలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి వచ్చేందుకు ఇటువంటి పథకాలు దోహదపడతాయి. ఎస్‌సి సబ్ ప్లాన్ గత వార్షిక బడ్జెట్‌లో ఎస్‌సి కార్పొరేషన్ కు దాదాపు 2000 కోట్లు కేటాయింపులు చూపించగా, వాటిని నవరత్న పథకాలకు మళ్ళించడం విచిత్రం. ఇదే తరహాలో ఉంటే అభివృద్ధి సూచీలలో వ్యత్యాసాలు అధిగమించడం ఎప్పటికి సాధ్యమవుతుంది?

దళిత, గిరిజనుల అభివృద్ధి వేగవంతం ఎలా అవుతుంది? ప్రతి ప్రభుత్వానికి వారి ప్రాధాన్యతలు వారికి ఉంటాయి. వైఎస్సార్ పార్టీ నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ఏ విధమైన వ్యతిరేకత లేదు. కానీ ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ విషయంలో అలక్ష్యం వహిస్తూ, వారి నిధులను వారికే ఖర్చు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నది. మొక్కుబడిగా బడ్జెట్ కేటాయింపులు చేసి సాధారణ పథకాల్లో ఎస్‌సి, ఎస్‌టిల శాతాన్ని లెక్కగట్టి వారికి నిధులను కేటాయిస్తున్నట్లు చూపించడం ద్వారా సబ్ ప్లాన్ అమలు తీరును అవహేళన చేస్తున్నారు. గతంలో సబ్ ప్లాన్ నిధులను హైదరాబాద్ సుందరీకరణకు కూడా వాడినారు. ఇరు రాష్ట్రాలలో ఎస్‌సి, ఎస్‌టి స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరగటం లేదు.

నోడల్ ఏజెన్సీల సమావేశాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఇక ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూప్ సమావేశం ఊసే ఎత్తడం లేదు. జిల్లా మానిటరింగ్ కమిటీల ఏర్పాటు గాని, సమీక్షలు గానీ, నివేదికలు భూతద్దంలో వెతికినా కనిపించవు. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక చట్టం అమలుకు ఇప్పటికైనా పటిష్ట ఏర్పాట్లు జరగాలి. దళిత ఆదివాసీల ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకొని పథకాలు సంఘాలను భాగస్వాములను చేయడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యకు నోచుకోని ఎస్‌సిల్లో 22 శాతం, ఎస్‌టిలలో 33 శాతం విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక రచించి అమలు చేయాలి. మానవ అభివృద్ధి సూచికల్లో అత్యంత ప్రధానమైన విద్యతో పాటు వైద్యాన్ని చేర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌సి, ఎస్‌టిల జనాభా నిష్పత్తి మేరకు నిధులు ఖర్చు చేయడం ప్రభుత్వాల బాధ్యత. పాలకులు దానికి కట్టుబడి ఉన్నప్పుడే దళిత, గిరిజన సాధికారత సాకారమవుతుంది. ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమం కోసం వారి జనాభాను గణనలోకి తీసుకుని ప్రత్యేక పథకాలను రూపొందించాలి.

గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News