Wednesday, January 22, 2025

సిఎంతో సమావేశమై సమస్యకు తెరదించండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శాసన సభ తీర్మానించిపంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమస్య పరిష్కారానికిగాను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తాము ఉన్నతమైన రాజ్యాంగ వ్యవస్థతో వ్యవహరిస్తున్నామని అంటూనే శాసనసభ రెండోసారి ఆమోదించి న బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపలేరని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ ఇటీవల మరోసారి ఆమోదం తెలిపింది. వీటిని ఆ వెంటనే గవర్నర్‌కు పంపింది. అయితే వాటిని గవర్నర్ రాష్ట్రపతికి రిజర్వ్ చేశారని తమిళనాడు ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీశుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ వాదనలను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పర్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘ బిల్లుల ప్రతిష్టంభనకు గవర్నర్ తెరదించాలని కోరుతున్నాం.ఈ దిశగా ముఖ్యమంత్రితో కలిసి నడిస్తే అభినందిస్తాం. సిఎంను గవర్నర్ ఆహ్వానించి.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ఉన్నతమైనరాజ్యాంగ వ్యవస్థల( గవర్నర్)తో వ్యవహరిస్తున్నామనే విషయం తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో నే రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 200’ను ప్రస్తావిస్తూ.. పునః పరిశీలన కోసం గవర్నర్ కార్యాలయంనుంచి వచ్చిన బిల్లులను శాసన సభ రెండోసారి ఆమోదించిన తర్వాత గవర్నర్ వాటిని రాష్ట్రపతికి పంపలేరని చెప్పింది. ఈ కేసును డిసెంబర్ 11న విచారిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ తీర్మానించిన అనేక బిల్లులకు ఆమోదముద్ర గవర్నర్ వేయడంలో జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. మూడేళ్లనుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి ఆమోదం తెలపకుండా గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News