Monday, December 23, 2024

పరువునష్టం కేసు: రాహుల్ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు పరువునష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస నాయకుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జులై 21న విచారణ జరపనున్నది.

ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మంగళవారం ప్రస్తావన చేయడంతో గుజరాత్ హైకోర్టు జులై 7న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే శుక్రవారం విచారించడానికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.

2019లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మోడీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ఒకరు సూరత్ కోర్టులో పరువునష్టం పిటిషన్ వేశారు. దీనిపై ఈ ఏడాది మార్చి 23న తీర్పు వెలువరించిన సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కోల్పోవలసి వచ్చింది. అయితే..ఈ తీర్పుపై స్టే ఇవ్వడం వల్ల రాహుల్ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

కాగా..సూరత్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ అప్పీలు చేసుకోగా దీనిపై విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ స్టే ఇవ్వడానికి నిరాకరించారు. రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా 10 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, స్టే ఇవ్వడానికి సహేతుకమైన కారణాలేవీ లేవని అన్నారు. సూరత్ మెజిస్టీరియల్ కోర్టు తీర్పు న్యాయబద్ధంగా, సక్రమంగా ఉందని ఆయన తెలిపారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాహుల్ జులై 15న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News