Monday, December 23, 2024

ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా..హలాలాపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, నిఖా..హలాలాల ఆచారాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తి పిఎస్. నరసింహతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. దీనికి ముందు ఈ అంశంపై విచారణ జరపడానికి తాజాగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి హేమంత్ గుప్తాలతో కూడిన ఇదివరకటి ధర్మాసనం స్పష్టంచేసింది.

“ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఇప్పటికే ముఖ్యమైన అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని పరిశీలించడానికి మేము మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం” అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ అంశాన్ని ఉపాధ్యాయ ఇదివరలో కూడా.. అంటే గత ఏడాది నవంబర్ 2న పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టు 30న న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, హేమంత్ గుప్తా, సూర్యకాంత్, ఎంఎం. సుందరేశ్, సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం ఆ పిల్‌పై మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి), జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్లు), జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్‌సిఎం)లను కూడా ఈ కేసులో పక్షాలుగా(పార్టీలుగా) చేర్చి వారి నుంచి ప్రతిస్పందనను కోరింది. కానీ తర్వాత న్యాయమూర్తి బెనర్జీ, న్యాయమూర్తి గుప్తా ఈ కేసు విచారణకు విస్తృత ధర్మాసనంను ఏర్పాటుచేయాలని సెప్టెంబర్ 23న, అక్టోబర్ 16న అభిప్రాయపడ్డారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, నిఖా…హలాలా ఆచారాలకు వ్యతిరేకంగా దాదాపు ఎనిమిది పిటిషన్లు వచ్చాయి. అందుకనే వాటిని విచారించడానికి విస్తృత ధర్మాసనం అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, నిఖా..హలాలాను రాజ్యాంగ వ్యతిరేకమని, అక్రమమని ప్రకటించాల్సిందిగా ఉపాధ్యాయ తన పిల్‌లో పేర్కొన్నారు.

ముస్లింలలో పురుషుడు గరిష్ఠంగా నలుగురిని పెళ్లాడేందుకు వారి ధర్మశాస్త్రం అనుమతిస్తుంది. అది కూడా కొన్ని షరతులకు లోబడి. ముస్లిం మహిళలు కూడా భర్తతో పొసగనప్పుడు విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోడానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఒకవేళ ముస్లిం మహిళ విడాకులు ఇచ్చి తిరిగి భర్తను పునర్వివాహం చేసుకోవాలనుకుంటే మాత్రం ఆమె మరో వ్యక్తిని పెళ్లాడి, అతడి నుంచి విడాకులు పొందాకే తిరిగి తన పాత భర్తను వివాహమాడడానికి వీలుంటుంది. ధర్మసూక్ష్మాలు చాలానే ఉన్నాయి. కాగా ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా..హలాలాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2018లో స్వీకరించింది. ఆ తర్వాత దానిని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News