Monday, December 23, 2024

ఏకలింగ జంటలకు నిరాశ

- Advertisement -
- Advertisement -

ఏకలింగ (సలింగ, స్వలింగ) జంటలకు వైవాహిక హక్కు కల్పన లేదా వారి వివాహాలకు చట్టబద్ధత ప్రసాదించడం తమ చేతిలో లేని విషయమని, అది పార్లమెంటు చేయవలసిన పని అని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు మెజారిటీ (౩x2) తీర్పు వారి ఉనికికి ఎటువంటి ముప్పు తలెత్తనీయకుండా తగిన రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకొన్నది. ఈ జంటలు వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పొందజాలరని, ఇతరులతో సమానమైన వివాహ హక్కును అనుభవించజాలరని ధర్మాసనంలోని మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వారసత్వం, పిల్లల దత్తత వంటి హక్కులు ఏకలింగ జంటలకు సంక్రమించబోవని తేల్చి చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డి.వై చంద్రచూడ్ అధ్యక్షతన గల ఈ ధర్మాసనంలో ఇంకా న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కొహ్లి, పిఎస్ నరసింహ వున్నారు.

జస్టిస్‌లు చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్‌లు వేర్వేరు తీర్పులను వెలువరించారు. ఎల్‌జిబిటిక్యు= లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌లుగా పిలుస్తున్న ఏకలింగ జంటలు ఇతర వైవాహికులకు కల్పిస్తున్న హక్కులను తమకు కూడా కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 21 అర్జీలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గత ఏప్రిల్ మే నెలల్లో పది రోజుల పాటు వాదోపవాదాలు విని విచారణ జరిపిన ధర్మాసనం ఇప్పుడు తీర్పును ప్రకటించింది. వివాహమనేది స్త్రీ పురుషుల మధ్యనే జరగాలని, ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీల పెళ్ళిని అనుమతించరాదని కేంద్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్), జమాయిత్ ఉలామ ఇ హింద్ వంటివి గట్టిగా వాదించిన నేపథ్యంలో ధర్మాసనం వీరి కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించడానికి నిరాకరించింది.

కులాంతర, మతాంతర వివాహాల కోసం రూపొందించిన ప్రత్యేక వివాహ చట్టాన్ని వీరి కోసం పొడిగించడం గాని, సడలించడం గాని తమ చేతిలో పని కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సలింగ పెళ్ళిళ్ళను అనుమతించడం కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించడం సాధ్యమయ్యే పని కాదని, ఈ వ్యవహారాన్ని పార్లమెంటుకు విడిచి పెట్టాలని మెహతా అభిప్రాయపడ్డారు. ప్రత్యేక వివాహ చట్టం కింద ఏకలింగ వివాహాల కోసం వేరుగా సంఘాల ఏర్పాటును అనుమతించవచ్చును అని సిజెఐ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా కేంద్రం వ్యతిరేకించింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఏకలింగ జంటలకు వివాహ హక్కు కల్పించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. వివాహం శిలా సదృశ వ్యవస్థ కాదని, మార్పుకి అతీతమైనది కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. సలింగ వివాహాలు కొత్త కాదని, పురాతన కాలం నుంచి వున్నవేనని, అలాగే అవి నగరాలకో, ఉన్నత వర్గాలకో మాత్రమే పరిమితమైనవి కూడా కావని ఆయన అన్నారు. ఈ జంటల పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా చూడాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆయన కోరారు.

ఏకలింగ జంటల హక్కులను నిర్ణయించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. అలాగే ఈ జంటల తరపున సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సిజెఐ ఆదేశించారు. అక్కడితో ఆగకుండా జీవిత భాగస్వామిని ఎంచుకొనే సామర్థం రాజ్యాంగం 21వ అధికరణ కల్పిస్తున్న జీవన హక్కు, జీవన స్వేచ్ఛకు సంబంధించిన హక్కు కిందికి వస్తుందని, స్వలింగ వివాహితులు సంఘాలుగా ఏర్పడే హక్కు కూడా ఇందులో భాగమేనని లైంగిక ప్రవర్తనను బట్టి ఏ వ్యక్తి పట్ల వివక్ష చూపడం తగదని స్పష్టం చేయడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి ఈ జంటలకు గట్టి రక్షా కవచాన్ని తొడిగారు. వాస్తవానికి పౌరులందరికీ సమాన హక్కు కల్పిస్తున్న భారత రాజ్యాంగమే ఈ జంటల వివాహ హక్కును గౌరవిస్తున్నదనే వాదన త్రోసిపుచ్చదగినది కాదు.

అయితే జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దేశంలో గల సంప్రదాయ వైవాహిక వ్యవస్థకు, అమెరికా తదితర దేశాల్లో చట్టబద్ధతను అనుభవిస్తున్న ఏకలింగ జంటల వివాహ హక్కుకు మధ్యస్థంగా తీర్పు చెప్పడం ద్వారా మార్పుకి ఆధునికతకు తలుపులు పూర్తిగా మూసివేయకుండా చూసింది. ఆ విధంగా ధర్మాసనం ఎంతో విజ్ఞతను ప్రదర్శించింది. ప్రపంచంలో 32 దేశాలు స్వలింగ వివాహాలను గుర్తించాయి. అవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, తైవాన్ మొదలైనవి. ఆసియాలో ఈ గుర్తింపును ఇచ్చిన మొట్టమొదటి దేశం తైవాన్. వివాహమనేది సమాజానికి ఇరుసు వంటిది. ఈ వ్యవస్థలోకి మార్పులను అనుమతించడం మనలాంటి సమాజాల్లో సులభసాధ్యంకాదు. అయితే మార్పును గట్టిగా నిరాకరించకుండా జాగ్రత్త పడిన తీర్పుగా దీనిని పరిగణించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News