Wednesday, January 22, 2025

గూగుల్ సెర్చ్‌లో.. సైబర్ నేరగాళ్ల వల

- Advertisement -
- Advertisement -

Scams on unofficial websites

అనధికారిక వెబ్‌సైట్‌లలో మోసాలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్, సైబర్ క్రైం, నేర విభాగం, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఒటి పోలీసులు నేర నియంత్రణ, నేర పరిశోధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నప్పటికీ నేరగాళ్లు ఏమాత్రం తమ మోసాలను యదేశ్ఛగా సాగిస్తున్నారు. రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న నేరాలను నియంత్రించడంలో క్రైం విభాగం విఫలమౌతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆర్థిక నేరాల కేసులలో సిసిఎస్, సైబర్ క్రైం, నేర విభాగం, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఒటిలు నేరాలకు అడ్డుకట్టవేయకపోవడంతో సైబర్ నేరగాళ్లు సైలెంట్‌గా నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో పల్స్ ఆక్సీమీటర్, కెవైసి,బ్యాంక్ రుణాలు, ఇసిమ్ పేరిట ప్రజలను మోసగిస్తున్నారు.తాజాగా గూగుల్ సెర్చ్ చేసే వారిపై సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. గూగుల్‌లో అనధికారిక సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేసిన వారికి ఫోన్ కాల్స్, మెసేజ్‌లలో లింకులు పంపి ఖాతాలలోని నగదును కాజేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు కోడ్ భాషల్లో మెసేజ్‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడేందుకు కొత్త రూట్‌ను ఎంచుకుంటున్నారు. ప్రధానంగా గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత వచ్చే ఫోన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. గతంలో గూగుల్ సెర్చ్ చేయగానే సైబర్ నేరగాళ్లు జోక్యం చేసుకొని బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డువివరాలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయించి మోసాలకు పాల్పడేవారని, ప్రస్తుతం గూగుల్ సెర్చ్ చేస్తున్న వారికి ఫోన్ చేసి మీకు సురక్షితమైన కోడ్ లాంగ్వేజ్‌లో మెసేజ్ వస్తుంది.. ఆ మెసేజ్ క్లిక్ చేసి మీ వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది.. అంటూ సూచిస్తారని, ఆయా వివరాలు నింపేలోపే మీ ఫోన్‌లో ఉండే ఫోన్- పే, జిపే ఇతర మనీ వాలెట్‌కు లింక్ ఉన్న ఖాతాల నుంచి నగదును ఖాళీ చేస్తున్నారని సైబర్ నిపుణులు వివరిస్తున్నారు.

బ్యాంక్ లోన్స్‌లో చేతివాటం
బ్యాంక్‌లోన్ కావాలా అంటూ ఫోన్ కాల్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మెల్లగా మాటలు కలపడం, వారికి బ్యాంక్ రుణం అవసరం లేకున్నా వారిని మొహమాటపెట్టి పెద్ద మొత్తంలో బ్యాంక్‌లోన్ మంజూరు చేయిస్తున్నారు. ఆ డబ్బులు అసలు ఖాతాదారుడికి కాకుండా మరొకరి ఖాతాలో జమ చేయిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఖాతాదారుడికి తెలియకుండానే దోచేసుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి కేసు ఒకటి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. చిక్కడపల్లికి చెందిన సంగీతకు యాక్సిస్‌బ్యాంక్‌నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ కాల్ వచ్చింది. మీకు తక్కువ వడ్డీతో ఎక్కువ సొమ్ము జమ చేస్తామంటూ మాటల్లోకి దింపారు.

తనకు లోన్ అవసరం లేదన్న వినకుండా లోన్‌తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి రూ.4.70 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని సంగీత ఖాతాలో జమ చేయించారు. మీ ఖాతాలో ఇంత డబ్బు జమ అయిందని సంగీత ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌వచ్చిన కొద్ది క్షణాల్లో ఆమె ఖాతాలోంచి రూ.5లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే బాధితురాలు బ్యాంక్‌సిబ్బందిని సంప్రదించింది. అయితే, వారు ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే విత్‌డ్రా కూడా అయ్యాయని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే మోసపోయాయని తెలుసుకొని సంగీత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్న తమకు సమాచారం ఇవ్వాలని సైబర్ క్రైం పోలీసులు పేర్కొంటున్నారు.

సిమ్‌కార్డ్ అపడేట్ 
ఇ-సిమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నయా దందాకు తెర తీశారు. సిమ్ కార్డు అప్‌డేట్ పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. రిజిస్ట్రేషన్, ఇ మెయిల్, అప్ డేట్ అంటూ అమాయక ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఇటువంటి కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇ- సిమ్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం ఎంచుకున్నారు. సిమ్ కార్డ్ అప్ డేట్ అంటూ ఫోన్ చేస్తారు.. సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని మెసేజ్ పెడుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మెసేజ్‌లో వచ్చిన నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. సిమ్ బ్లాక్ కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్ కేవైసీ నింపాలని కేటుగాళ్లు చెబుతుండగా, తెలియక అమాయకంగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తున్నారు. దీనిద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్లు హ్యాక్ చేసి, బ్యాంకులో ఉన్న నగదును లూటీ చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఫోన్ చేసే అడిగే ఎవ్వరికీ వివరాలు చెప్పొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News