Monday, December 23, 2024

గుజరాత్‌లో లక్ష కోట్ల స్కామ్!

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో లక్ష కోట్ల రూపాయల భారీ స్కామ్ చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగ్ నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. గత అయిదు సంవత్సరాల్లో అంటే 2017నుంచి 2022 మధ్య కాలంలో ‘ఇతరుల’పద్దు కింద ఏజన్సీలు, సంస్థలకు ఇచ్చిన రూ.1.18 లక్షల గ్రాంట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్రప్రభుత్వం దాచి పెడుతోందని కంప్ట్రోలర్‌ఆడిటర్ జనరల్ ( కాగ్) తన నివేదికలో ఆరోపించారు. ప్రతి సంవత్సరం రాష్ట్రప్రభుత్వం జీతాలు, అలవెన్సులు, ఇతర చిల్లర ఖర్చులకోసం, మూలధనం ఆస్తుల సృష్టికోసం స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గ్రాంట్‌ఇన్ ఎయిడ్ రూపంలో ‘ఇతరం’ పద్దు కింద గ్రాంటు ఇస్తూ ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీలు, పంచాయతీ రాజ్ సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఏటా ఇచ్చే ఆర్థిక సాయంలో మొత్తం సొమ్ములో 3538 శాతం ఈ ‘ఇతరం’ పద్దు కింద చెల్లిస్తూ వచ్చింది. కాగా రాష్ట్రప్రభుత్వం పాల్పడిన ఈ తప్పుడు విధానాన్ని కాగ్ తన నివేదికలో తీవ్రంగా తప్పుబట్టింది.

ఒక్క 2021 22 ఆర్థిక సంవత్సరంలోనే ఈ పద్దు కింద రాష్ట్రప్రభుత్వం గుర్తు తెలియని సంస్థలు, ఏజన్సీలకు ఏకంగా రూ. 24,764.54 కోట్లను చెల్లించింది.‘ ఒక వేళ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గనుక రాష్ట్రప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో చెప్పుకోదగ్గ వంతు ఉంటే పద్దుల పారదర్శకత కోసం గ్రాంటు ఇచ్చిన సంస్థ వివరాలను ప్రభుత్వం అందజేయడం అవసరం’ అని కాగ్ తన నివేదికలో అభిప్రాయపడింది. గుజరాత్‌లో గత అయిదేళ్లుగా గ్రాంట్ ఇన్‌ఎయిడ్ మొత్తం ప్రభుత్వ వ్యయంలో దాదాపు 37 శాతం ఉంటోంది. అంతేకాదు. గత అయిదేళ్ల కాలానికి రాష్ట్రప్రభుత్వం అందజేసిన ఆర్థిక లెక్కలు ‘ఇతరం’ పద్దు కింద వివిధ సంస్థలకు విడుదల చేసిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెరిగినట్లుగా పేర్కొన్నప్పటికీ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందజేసే ప్రక్రియను పర్యవేక్షించడం కోసం కోడ్‌లు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం ఎలాంటి వ్యవస్థను కనుగొనలేదని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. షరతులతో కూడిన గ్రాంట్ ఇన్‌ఎయిడ్‌ను అందుకున్న రాష్ట్రప్రభుత్వ అధికారులు ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను సక్రమంగా వినియోగించడానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సంబంధిత శాఖల అధికారులకు పంపించాల్సి ఉంటుంది.

Also Read: కారు ప్రమాదంలో కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ మృతి..

అంతేకాదు వారు ఈ వివరాలను ఆర్థిక సంవత్సరం ముగిసే 12 నెలల్లోగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు పంపిస్తే వాటి ఆధారంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను మంజూరు చేయడం జరుగుతుంది. 2021 22ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థలకు విడుదల చేసిన మొత్తం రూ.69,807.79 కోట్లు కాగా అందులో 35 శాతం అంటే రూ.24.764.54 కోట్లు ‘ఇతరం’ పద్దు కింద వర్గీకరించబడిన సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా విడుదల చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ శాఖలు సృష్టించిన ఆస్తుల వివరాలు ఏమీ లేకుండా విడుదల చేయడం ఆందోళన కలిగించే అంశమని కాగ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. కాగ్ నివేదికను రాష్ట్రప్రభుత్వం గత వారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి( జిఎస్‌డిపి) మెరుగుపడినందుకు ఓ వైపు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే కాగ్ ఇంత భారీ ఎత్తున ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాగా ఇతరుల పేరుతో దగ్గరి వ్యక్తులకు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టటడాన్ని

ఎక్కడా చూడలేదని గతంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్‌లో మంత్రిగా పని చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జయనారాయణ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. అన్నిటికీ ‘గుజరాత్ మోడల్’గా చూపించే మోడీ ప్రభుత్వం ఈ భారీ స్కామ్‌ను కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకున్నా అయిదేళ్ల పాటు ‘ఇతరులకు’ నిధుల వరద ఎలా పారిచ్చారో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వం, బిజెపి పెద్దలపైన ఉందని ఆయన అంటున్నారు. కాగా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని రాష్ట్రాలకు నిధులను నిలుపుదల చేసే కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ఇతరులకు లక్షా 18 వేల కోట్ల రూపాయలను ఎలా కట్టబెట్టారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘అయినవాళ్లకు ఆకుల్లో.. కానివాళ్లకు కంచాలో’్ల అన్న సామెత కేంద్రంలోని మోడీ సర్కార్‌కు బాగా సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News