Monday, December 23, 2024

కఠోర చమత్కృతుల ఆస్కార్ వైల్డ్

- Advertisement -
- Advertisement -

Oscar Wilde (1854 – 1900)
కళ కళ కోసమే. కళ (Art) ఏక కాలంలో బాహ్యం, ప్రతీకాత్మకం (Symbol) – Oscar Wilde.

పగిలిన నీ చితాభస్మ కలశం
పరాయి కన్నీళ్ళతో నిండ నున్నది,
ఏడ్చే వాళ్ళంతా వెలివేయబడ్డ భ్రష్టులే.
ఇవి అతని సమాధి మీద రాయబడిన శిలాక్షరాలు (Epitaph) – ఆతని ప్రసిద్ధ కవిత

The Ballad of Reading Gaol నుండి గ్రహింపబడినవి. మరణశిక్ష పడిన తోటి ఖైదీకి అశ్రు నివాళి ఈ దీర్ఘకవిత. ఆతని సమాధి నిర్మాణానికి అతని కున్నంత చరిత్ర వుంది. పారిస్ విందులో ఫుడ్ పాయిజన్ వల్ల 46వ ఏట మరణించాడు. అతడే ఐరిష్ దేశ వివాదాస్పద కవి ఆస్కార్ వైల్డ్.

ఆస్కార్ వైల్ (Oscar Fingal O’Flahertie Wills Wilde) ఐర్లాండ్ లోని డబ్లిన్ సంపన్న కుటుంబంలో జన్మించాడు. మేధావుల సరసన పెరిగాడు. తండ్రి ప్రసిద్ధ డాక్టర్, ఆరిష్ ప్రభుత్వ సలహాదారుడు. పేద ప్రజల కొరకు నేత్రవైద్యశాలను స్థాపించాడు. తల్లి విప్లవ కవయిత్రి, అనువాదకురాలు, నవలా రచయిత్రి. ఆస్కార్ పై ఆమె ప్రభావం ఎంతో వుందంటారు.

విద్యాభ్యాసం ట్రినిటీ కాలేజ్ డబ్లిన్, ఆక్స్ ఫర్డ్ లలో జరిగింది. పోరేటోరా రాయల్ కాలేజీలో చేరి గ్రీక్, లాటిన్ భాషలను అభ్యసించాడు. ఫ్రెంచ్, జర్మన్ భాషలలో మాట్లాడడం నేర్చుకున్నాడు. చిత్రలేఖనం పై మోజు పెంచుకున్నాడు. అందుకే ఆయన తదనంతర కాలంలో English Renaissance in Art, Aestheticism పై అనర్గళంగా ప్రసంగాలు చేశాడనవచ్చు. విశ్వవిద్యాలయ ఫిలసాఫికల్ సొసైటీ లో చేరే అవకాశం లభించచం వల్ల డాంటే గాబ్రియల్ రొజట్టి, చార్లెస్ స్విన్ బర్న్ లాంటి పలు మేధావుల సాంగత్యం లభించింది. చురుకైన విద్యార్థి కావ డం వల్ల అతన్ని అనేక స్కాలర్షిప్ లు వరించా యి. అతని కవితలు, సాహిత్య రచనలు ఆక్స్ఫర్డ్ తో పాటు యావత్ యూరప్ ను ఆకట్టుకున్నవి. అతని ఏకైక నవల ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అతనికి అంతులేని ఖ్యాతిని తెచ్చిపెట్టిటింది. చతురోక్తుల సంక్షిప్త రచనలు, నాటకాలు, కథానికలు, సాహిత్య విమర్శలు, పత్రికా రచనలు, కవితలు – అన్ని సాహిత్య ప్రక్రియల్లో ఆరితేరాడు.

ఆక్స్ ఫర్డ్ లో పట్టా పుచ్చుకున్నాక, వైల్ లండన్ కు వెళ్లాడు. అక్కడ కొన్నాళ్ళ పాటు కవితా వ్యవసాయం సాగించి తొలి సంపుటి Poems వెలువరించాడు. వైల్ కు ఉపన్యాలివ్వటం ఇష్టమైన వ్యసనం. తదుపరి, అమెరికాకు వెళ్ళి అక్కడి విద్యా సంస్థలలో కేవలం 9 నెలలలో 140 సాహిత్యోపన్యాసాలు ఇచ్చాడు. హెన్రీ లాంగ్ పెలో, ఆలివర్ వెండెల్ హోమ్స్, వాల్చ్ విట్మన్ వంటి పలు ప్రఖ్యాత సాహిత్య వేత్తలతో పరిచయం పెంచుకున్నాడు. ఈ అమెరికా మహా ప్రపంచంలో విట్మన్ ను మించిన అభిమాని నాకు మరెవ్వరూ లేరు. ఆయన నా ఆదర్శం అని చెప్పుకున్నాడట.

అమెరికా టూర్ ముగిసాక, ఇంగ్లండ్, ఐర్లండ్లలో వైల్ ఉపన్యాస పరంపర కొనసాగింది. దాంతో ఆస్కారి వైల్ యూరప్ లో తిరుగులేని సాహిత్యకారుడిగా ప్రసిద్ధికెక్కాడు. కాన్స్ టాన్స్ లాయిడ్ అనే ధనిక ఆంగ్ల వనితను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్ళకు ఇద్దరు కొడుకులు.

కాని, ఇన్ని ప్రతిభలున్న వైల్ లో, రానురాను విపరీత భావ ధోరిణి, వికటించిన జ్ఞానం చోటు చేసుకుంది. సౌందర్యవాదం పేరిట కృత్రిమ దేహాలంకారాలను ప్రోత్సహించాడు. నర్మగర్భ మొరటు హాస్యోక్తులతో వ్యాకుల పరిచే వాడు.

ఏ సౌందర్యాంశాని కైనా ఇట్టే లొంగిపోయే అతిశయ మనస్తత్వం వైల్ ది. కాథలిక్ ప్రవచనాలు, సౌందర్య వాదాలు, క్షీణ కళలు – Aesthetic and ౄecadent movements సహా అన్నీ అతన్ని ఆకర్షించాయి. సౌందర్యాత్మక నైతికత (Aesthetic Morality) మీద కొత్త సిద్ధాంతాలను లేవనెత్తాడు. అందం, ఆర్ట్, యవ్వన లాలస లను ఒకే తాటిపై నిలిపే ప్రయత్నం చేశాడు. ఇంద్రియ జనిత సుఖం కోసం ప్రయత్నిచడమే జీవిత పరమార్థమనే హీడనిజం (Hedonism) సూత్రాలను స్వంతం చేసుకున్నాడు.

తుదకు, స్వలింగ సంపర్క (Homo sexual) అభియోగంతో జేలు పాలయ్యాడు.

వైల్ విపరీత విరోధ భావాల పుట్ట. ఆడవాళ్ళు ప్రేమించబడడానికే కాని అర్థం చేసుకో బడడానికి కాదు. తన్నుతాను ప్రేమించుకోవడం అంటే జీవిత పర్యంత శృంగార అనుభవం. జీవితం ఉపేక్షించరాని గంభీర వ్యవహారమేమీ కాదు. ఇవీ కొన్ని అతని విచిత్రోక్తులు. వైవిధ్య భరితమైనవి అతని రచనలు చాలా వరకు విరోధాభాసాలు ( Paradoxes). కాని, అతని కవిత్వం మృదువైనది, వైవిధ్య భరితమైనది. అందుకు నిదర్శనం ఆతని ఈ కవితలు (నా అనువాదాలు):

1. పదిలంగా నడువు, నిదానంగా మాట్లాడు
ఆ మంచు పొరల కింద ఆమె నిద్రిస్తున్నది,
ఆమె డైసీ పూల వికసన స్వనాన్ని వినగలదు మరి. ( ఇది ఆత్మ బంధువైన చిన్నారి మరణ సందర్భంలో అతడు రాసిన ఆత్మిక కవిత).

2. స్వర్ణచాయల స్వరరాగసమ్మేళనం:
(Symphony In Yellow – Oscar Wild)
ఏటి వంతెన మీద ఒక భారీ బస్సు
పచ్చని సీతాకోక చిలుకలా పాకుతున్నది,
అక్కడక్కడ అడపాదడపా
నీటి మీద కాలునిలువని చీకటీగల్లా
కదలిపోతూ పాదచారులు!
పసుపు పచ్చని ఎండుగడ్డి నిండిన
లంగరు దింపిన పడవలు
చీకటి తటాల ఓడ రేవులోనిలిచివున్నవి,
నదీ తీరం
దట్టమైన పొగమంచుల
పైడిరంగుల పట్టుశాలువ కప్పుకున్నది!
గుడి ముంగిట పండువారిన రావిచెట్ల ఆకులు
రెపరెపలాడుతున్నవి,
అలలువోయి మెలికలు తిరిగిన పుష్యరాగ శిలా శలాకలా
నా ముందు పాలిపోయిన లేతపచ్చని థేమ్స్ నది!

3. వగపు :
A Lament – Oscar Wild
తథాస్తు!
శుభమస్తు!
పసిడి మేడలలో నివసించే సుఖజీవనులకు,
జడివానల బాధ లేని,
కూలిన వనవృక్షాల చింత లేని సంపన్నులకు,
ఆకలి రోజుల వేదన నెరుగని,
కుంగిన ముదుసలి రోదన పట్టని,
శోకతప్త ఒంటరి మాతృ హృదయ ఘోష తెలియని
సిరిమంతులకు. –
శుభమస్తు!
బతుకు బాధల అలసిన బాటలలో శోషిల్లీ
దేవుని చెంతకు చేరాలని
నింగికి నిచ్చెన లేస్తున్న నిర్భాగ్యులకు.

మంచి చెడులను మించి మూర్తీభవించిన అతీత విశృంఖల కవితాత్మ వైల్ ! కఠోర చమత్కృతుల వివాదాస్పద కవి ఆస్కార్ వైల్డ్!

నాగరాజు రామస్వామి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News