Monday, December 23, 2024

రసవత్తరంగా మారనున్న సింగరేణి ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ ఎన్నో మలుపులు తిరిగి, చివరకు ఈనెల 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. సింగరేణిలో మొదటి ధఫాగా రెండు సంవత్సరాల గుర్తింపు సంఘం హోదా ఉండగా, మద్యంతరంలో నాలుగు సంవత్సరాల గుర్తింపు సంఘం హోదా కు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు సింగరేణిలో 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. సింగరేణిలో 1998 సెప్టెంబర్ నెలలో మొదటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి నాడు సింగరేణిలో 1 లక్ష 8వేల, 21 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. 2023 డిసెంబర్ 27న జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కేవలం 39 వేల 500 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. 7 గుర్తింపు ఎన్నికల కాలంలో సింగరేణిలో సూమారు 68వేల 712 మంది కార్మికుల తగ్గి పోయారు.

సింగరేణిలో మొట్ట మొదటి సారిగా 1998 సెప్టెంబర్‌లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగగా 1లక్ష 8వేల 212 మంది కార్మిక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా నాడు మొదటి సారిగా కార్మికులు ఎఐటియుసి సంఘాన్ని గుర్తింపు సంఘంగా గెలిపించారు. రెండవ సారి 2001 ఫిబ్రవరిలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగగా నాడు 1లక్ష 3వేల 904 మంది కార్మిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండవ సారీ కూడా గుర్తింపు సంఘంగా ఎఐటియుసి గెలుపొందింది. మూడవ సారి 2003 మే నెలలో జరిగిన ఎన్నికల్లో 93 వేల 470 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. మూడవ సారి గుర్తింపు సంఘంగా ఐఎన్‌టియుసి సంఘంను కార్మికులు గెలిపంచారు. నాలుగవ సారి 2007 సంవత్సరం మే నెలలో సింగరేణి ఎన్నికలు జరుగగా సింగరేణిలో 75వేల 376 మంది కార్మికులు ఉన్నారు. నాలుగవ సారి మళ్లీ ఎఐటియుసి సంఘాన్ని కార్మికులు గెలిపించారు.

ఐదవ సారి 2012 జూన్‌లో సింగరేణి ఎన్నికలు నిర్వహించగా నాడు 63వేల 827 మంది కార్మికులు ఉన్నారు. ఐదవసారి సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్) ను కార్మికులు గెలిపించారు. ఆరవ సారి 2017 అక్టోబర్ నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా నాడు సింగరేణిలో 52వేల 217 మంది కార్మికులు ఉన్నారు. ఆరవ సారి కూడా కార్మికులు టిబిజికెఎస్ సంఘాన్ని గుర్తింపు సంఘంగా గెలిపించారు. 2021లో సింగరేణి ఎన్నికలు జరుగాల్సి ఉన్నప్పటికి 2023 వరకు వాయిదా వేస్తు వచ్చారు. సింగరేణిలో 7వ సారి జరిగే గుర్తుంపు సంఘం ఎన్నికల్లో 39వేల 500 మంది కార్మిక ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

…సింగరేణిలో 13 యూనియన్లు పోటికి సిద్దం
ఈనెల 27న జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 సంఘాలు పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 10 తేదిన సింగరేణిలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉంది. సింగరేణిలో ప్రస్తుతం ఎఐటియుసి, ఐఎన్‌టియిసి, హెచ్‌ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు, టిబిజికెఎస్, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, ఎఐఎఫ్‌టియు, సింగరేణి ఐక్య కార్మిక సంఘం, సింగరేణి ఉద్యోగుల సంఘం, ఎస్‌సి,ఎస్‌టి ఎంప్లాయిస్ సంఘం, ఎలక్ట్రిషన్ హెల్పర్ అసోసియేషన్ సంఘంలు సింగరేణి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

…ఒంటరి పోరేనా..?
సింగరేణిలో ఈనెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్న నేపద్యంలో 13 సంఘాలు పోటీలో ఉండబోతున్న నేపద్యంలో అన్ని సంఘాలు ఒంటరి పోరుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎఐటియుసి, ఐఎన్‌టియుసి సంఘాలు కలసి సింగరేణిలో పోటీ చేస్తాయా అనే ఊహాగానాలు వెలువడుతున్న నేపద్యంలో పట్టు విడుపు ఎవరు వీడడం లేదనే వాదనలు వినవస్తున్నాయి, నవంబర్ 30న జరిగిన అసెంభ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్, సిపిఐ పొత్తుల కలయిలో పోటీ చేయగా, సింగరేణిలో కూడా కలుస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుచున్నాయి. కాగా ఎఐటియుసి నాయకులు మాత్రం పొత్తు ఉండక పోవచ్చనే సంకేతాలు తెలియ జేస్తున్నారు. ఐఎన్‌టియుసి పొత్తులో సగం అడుగుతుందనే విషయం సమచార వర్గాల ద్వారా తెలుస్తోంది. కాని ఎఐటియుసి మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఏది ఏమైన ఈనె 27 ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నికలు, అనంతరం ఫలితాలు ఉండడంతో కార్మిక వర్గాల్లో కాస్తా ఉత్కంఠ నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News