Thursday, January 23, 2025

మీర్‌పేట్‌లో కలకలం రేపిన విద్యార్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో ఇటీవల సంభవిస్తున్న చిన్నపిల్లల వరుస కిడ్నాప్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఆబిడ్స్‌లో బిహార్ రాష్ట్రానికి చెందిన బిలాల్ అనే కిడ్నాపర్ చేతుల్లో కిడ్నాప్‌కు గురైన సంఘటన మరువక ముందే తాజాగా రాచకొండ కమిషనరేట్‌లోని మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థి కనిపించకుండా పోయిన సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… జిల్లెలగూడలోని డిఎన్‌ఆర్‌కాలనీలో నివాసం ఉండే మధుసూదన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు ఆదివారం సాయంత్రం 3:40 సమయంలో ట్యూషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుండి బయలుదేరారు. మార్గమధ్యలో పెద్ద కుమారుడు ఓ ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ట్యూషన్‌కు చేరుకున్నాడు. కాగా సాయంత్రం 4 గంటలకు ట్యూషన్ టీచర్ మధుసూదన్‌రెడ్డికి ఫోన్ చేసి అతని చిన్న కుమారుడు మహిధర్‌రెడ్డి (13) ట్యూషన్‌కు రాలేదని తెలిపాడు.

స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఎక్కడికైనా వెళ్లిఉంటాడని మొదటగా భావించినప్పటికీ 6 గంటలకు మధుసూదన్‌రెడ్డి తిరిగి ట్యూషన్ టీచర్‌కు ఫోన్‌చేయగా అప్పటికి కూడా మహిధర్‌రెడ్డి ట్యూషన్‌కు రాలేదని టీచర్ తెలిపాడు.దీంతో మహిధర్‌రెడ్డి ఆచూకీ కోసం అతని తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో మధుసూదన్‌రెడ్డి మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పొలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా మధుసూదన్‌రెడ్డి నివాసం నుండి ట్యూషన్ మధ్యలో గల సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో మహిధర్‌రెడ్డి ఓ గుర్తుతెలియని వ్యక్తి నడుపుతున్న హొండాయాక్టివ ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లుగా గుర్తించారు.అయితే సదరు దిచక్ర వాహనదారుడిని మహిధర్‌రెడ్డి లిఫ్ట్ అడిగి వెళ్లాడా లేక వాహనదారుడే మహిధర్‌రెడ్డి కిడ్నాప్‌చేసి ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాడా అన్న కోణంలో పొలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తమ సిబ్బందిని 4 బృందాలుగా ఏర్పాటు చేసి మహిధర్‌రెడ్డి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించడంతో పాటు హొండాయాక్టివ ద్విచక్రవాహనం నెంబరు ప్లేట్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఏదీ ఏమైనప్పటికీ విద్యార్థి మహిధర్‌రెడ్డి అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని అతిత్వరలో ఛేదిస్తామని ఇన్‌స్పెక్టర్ కీసర నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News