లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఢిల్లీమీరఠ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ఓ స్కూల్‌బస్సు ఢిల్లీ మీరఠ్ ఎక్స్‌ప్రెస్ హైవే పై రాంగ్ రూట్‌లో వస్తోంది. అదే సమయంలో రాహుల్ విహార్ సమీపంలో వేగంగా వస్తున్న ఎస్ యు వి కారును బలంగా ఢీకొంది.
దీంతో కారులో ఉన్న 8 మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కారు డోర్లను కట్ చేసి మృతదేహాలను వెలికి తీశారు. స్కూల్ బస్సు డ్రైవరు ఢిల్లీ లోని ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్‌లో వస్తుండగా , కారు మీరఠ్ నుంచి గురుగ్రామ్‌కు వెళ్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేపై స్కూల్ బస్సు దాదాపు 9 కిమీ రాంగ్ రూట్‌లో వచ్చినట్టు పోలీస్‌లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది