చండీగఢ్: మార్ఫింగ్ చేసిన ఫోటోలతో ఒక 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఒక స్కూలు బస్సు డ్రైవర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని జీరక్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. నిందితుడు మొహమ్మద్ రజాఖ్(26) కొన్ని నెలల పాటు ఆ మైనర్ బాలికను వెంబడించి ఆమెతో స్నేహం కోసం ప్రయత్నించాడని, అయితే ఆ బాలిక అందుకు నిరాకరించిందని పోలీసులు గురువారం తెలిపారు. దీంతో ఆ బాలిక ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని చూపి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడని వారు చెప్పారు. తన కోర్కెను తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడని వారు తెలిపారు.
ఈ ఏడాది మే, జులై మధ్యలో ఆ బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో మూడుసార్లు మెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తమ కుమార్తె ప్రవర్తనలో మార్పును చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి చెప్పిందని, దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బుధవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్‌పి జస్పీందర్ సింగ్ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపిసిలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.