ఛండీగఢ్: హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో గురువారం రంజాన్ పండగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడి విద్యార్థులైన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.20 మంది గాయపడ్డారు. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఈబస్సు 30 మంది చిన్నారులతో చాలా స్పీడ్‌గా వెళ్తుండగా కనీనా లోని యున్హానీ గ్రామం వద్ద అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో బోల్తాపడింది.
ఈ ప్రమాదంపై హర్యానా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్టు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకుని వైద్య పరీక్ష చేయిస్తున్నామని, పరీక్ష తరువాత అతను మద్యం తాగి ఉన్నాడా లేదా తేలుతుందని మహేంద్రగఢ్ ఎస్‌పి అర్ష్‌వర్మ వెల్లడించారు. ఈ సంఘటన చాలా శోచనీయమని హర్యానా విద్యామంత్రి సీమా ట్రిఖా ఆవేదన వెలిబుచ్చారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించడంపైనే దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. రంజాన్ పండగైనప్పుడు స్కూలు ఎందుకు తెరిచిఉందని అడగ్గా, జిల్లా అధికారులు, స్కూల్ అధికారులు దీన్ని తెలుసుకుంటారన్నారు.
హైస్పీడ్‌తో డ్రైవర్ బస్సును నడుపుతుండగా అదుపు తప్పాడని గాయపడిన విద్యార్థి విలేఖరులకు చెప్పాడు. డ్రైవర్ మద్యం తాగిఉన్నట్టు కనిపిస్తోందని ఆరోపించాడు. ఈ ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలు ఈ విషాదాన్ని తట్టుకునేలా భగవంతుడు వారికి ధైర్యాన్ని అందివ్వాలని ఆకాంక్షించారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకునేలా స్థానిక అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రగాఢ సంతాపాన్ని తన ఎక్స్ పోస్ట్‌ద్వారా తెలియజేశారు. మాజీ సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్, కాంగ్రెస్ నేత, మాజీ సిఎం భూపీందర్‌సింగ్ హూదా తమ సంతాపాలను తెలియజేశారు.