Saturday, January 11, 2025

తాత్కాలిక పద్దతిలో టీచర్ల సర్దుబాటు

- Advertisement -
- Advertisement -

School education department has adjusted Teachers

విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు
సమీప పాఠశాలల టీచర్ల కేటాయింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ టీచర్లను సర్దుబాటు చేసింది. విద్యార్థులు తక్కువగా ఉండి, టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు అధికారులు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్ల ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాత్కాలిక పద్దతిలో అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.

పదోన్నతుల తర్వాతనే నియామకాలు

రాష్ట్రంలో త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని విద్యాశాఖ చెబుతోంది. అందులో భాగంగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు. అయితే ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడినా ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలలకు పైగానే సమయం పడుతుంది. అయితే ఈ విద్యాసంవత్సరం ఉన్న టీచర్లతోనే సరిపెట్టి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించిన తర్వాతనే కొత్త టీచర్ల నియామకాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో విద్యాశాఖలో 13 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్, సొసైటీ టీచర్లతో కలిపి 11 వేలకు పైగా టీచర్ పోస్టులే ఉంటాయి. త్వరలోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే మరిన్ని టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తతేనే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా స్పష్టత వస్తుందని,ఆ తర్వాతనే నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యావలంటీర్లు లేకుండానే…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన పాఠశాలల్లో ఏటా విద్యావలంటీర్లను నియమించి తరగతులు నిర్వహించేవాళ్లు. దీనివల్ల టీచర్ల ఉన్నా సమస్య తీవ్రత అంతగా కనిపించేది కాదు. అయితే కరోనా ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో విద్యావలంటీర్ల నియామకం జరగలేదు.కరోనా పరిస్థితుల కంటే ముందు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది విద్యావలంటీర్లు విధులు నిర్వహించగా, ఆ తర్వాత వారిని ప్రభుత్వం నియమించలేదు. ఈసారి విద్యావలంటీర్ల లేకుండానే ఉన్న టీచర్లనే సర్దుబాటు చేసి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్ల నియామాలు పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News